గీసుగొండ, జూన్ 17: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 99శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మండలంలోని శాయంపేట టెక్స్టైల్ పార్కులో 298 ఎకరాల్లో రూ. 840 కోట్ల పెట్టుబడితో దక్షిణకొరియాకు చెందిన యంగ్వన్ వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులకు శనివారం కంపెనీ చైర్మన్ కిహాక్సుంగ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో భూమలు కోల్పోయిన రైతులకు 130 ఎకరాల్లో లేఅవుట్ అనుమతులో కూడిన వంద గజాల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆగస్టు 15 లోపు పట్టాలు రైతులకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతం దేశానికే బ్రాండ్‌గా మారబోతున్నదన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారు ఇచ్చిన భూములతోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలే కారణం : మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌లోని ఆజంజాహీ మిల్లు మూతపడడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ దూసుకెళ్తున్నదన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఆజంజాహీ మిల్లును కాపాడాలని ఆనాడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను అడిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కరంటు, నీటి కష్టాలు లేకపోవడంతోనే అనేక పరిశ్రమలు వస్తున్నాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కృషితోనే టెక్స్టైల్ పార్కు వచ్చిందన్నారు. ఇక్కడ యంగ్వన్, కిటెక్స్ వస్త్ర పరిశ్రమల యూనిట్లు ఏర్పాటైతే ఈ ప్రాంతంలోని వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పేదల కోసం పరితపించే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదని పేర్కొన్నారు.
కేటీఆర్ కృషితోనే పరిశ్రమలు : ఎమ్మెల్యే చల్లా
మంత్రి కేటీఆర్ కృషితోనే తెలంగాణ పారిశ్రామిక, ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పార్కుకు కంపెనీలు రావడం లేదని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నాయకులు ఇక్కడకు వచ్చి చూడాలన్నారు. భూములు ఇచ్చిన రైతులకు తప్పకుండా పార్కులో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో త్వరలోనే పార్కుకు మరిన్ని కంపెనీలు రానున్నాయని పేర్కొన్నారు. పార్కుకు పూర్తి స్థాయిలో నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే పరకాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందించారు. దామెర, నడికూడ మండలాల్లో పోలీస్ష్టేషన్లు, 6గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణంలో పాటు పరకాల మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి నిధులు, ఆత్మకూరు మండలం హౌజ్‌బుజుర్గు గ్రామంలో మైనార్టీలకు ఇండ్ల స్థలాలు, రుణాలు ఇవ్వాలని విన్నవించారు.
యంగ్వన్ కంపెనీని ఆదరించాలి : చైర్మన్ కిహాక్ సుంగ్
యంగ్వన్ కంపెనీ పరిశ్రమను ఈ ప్రాంతంలో నిర్మించడం ఆనందంగా ఉంది. దీన్ని తమ సొంత కంపెనీగా అందరూ ఆదరించాలి. మొదటి విడుతలో 4 యూనిట్లను ప్రారంభిస్తాం. రెండో దఫా మరో ఏడు మొత్తం 11 యూనిట్లు ఏర్పాటు చేస్తాం. 21 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చైర్మన్ చెప్పారు. పార్కులో మొక్కలు నాటిన మంత్రులు, యంగన్వన్ కంపెనీ చైర్మన్.. యంగ్వన్ పరిశ్రమ శంకుస్థాపన అనంతరం పార్కులో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్, యంగ్వన్ చైర్మన్ కిహాక్సుంగ్, సౌత్ కొరియా అంబాసిడర్ చేంజ్ జాయి బక్ మొక్కలు నాటారు.
కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ ప్రావీణ్య, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, చేనేత, జౌళి శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, దివ్యాగుల చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోశ్‌కుమార్, ఆర్డీవో మహేందర్‌జీ, యంగ్వన్ ఎండీ షాజహాన్, కంపెనీ ప్రతినిధులు మనీసుక్ లీ, జాన్గోస్ కిమ్, ఐఎల్ఎఫ్ఎస్ చైర్మన్ ఆర్ఎస్ రెడ్డి, కొరియన్ కన్సల్టెంట్ జనరల్ సురేశ్ చుక్కపల్లి, గీసుగొండ, సంగెం, జడ్పీటీసీలు ధర్మారావు, సుదర్శన్‌రెడ్డి, సంగెం ఎంపీపీ కళావతి, శాయంపేట సర్పంచ్ రజిత, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవారెడ్డి, సతీశ్‌రెడ్డి, తహసీల్దార్ విశ్వనారాయణ పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే చల్లాపై పోటీకి జంకుతున్నరు..
‘పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పోటీగా నిలవడానికి ప్రత్యర్థులు జంకుతున్నరు. మీసాలు తిప్పినోళ్లు కూడా చల్లాపై పోటీ చేయడానికి భయపడి పక్క నియోజకవర్గాలకు వెళ్తున్నరు. ప్రజలకు మేలు చేసే వాళ్లను కడుపులో పెట్టుకుంటరు. రౌడీజం, గుండా ఇజం చేస్తాం అంటే కుదరదు. ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమానికి కొందరు పూనుకొన్నరు. అలాంటి వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపడ్తరు. కాకతీయ టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం’ అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.