మల్హర్, మే,21 : తాడిచర్ల సింగిల్ విండో ఆధ్వర్యంలో మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంతో పాటు వేసిన బస్తాల తరలింపులో సొసైటీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్లలో గత మూడు రోజులుగా 1200 ధాన్యం బస్తాలు తూకం వేసినప్పటికి ధాన్యం కళ్లాల్లోనే మగ్గుతున్నాయి. జిల్లా అధికారులు సెంటర్లలో తనిఖీ చేసి చివరి గింజ వరకు కొంటామని గొప్పలు చెప్పడమే తప్ప చేసింది ఏమీ లేదని రైతులు పేర్కొంటున్నారు. తాడిచర్లలో ఎవరైతే తమకు మద్యం, డబ్బులు ఇస్తారో వారికే ముందు కాంటాలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కొందరు రైతులు వర్షం వస్తే ఇబ్బందులకు గురి అవుతామని భావించి తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన చైర్మన్, డైరెక్టర్లు ఏమీ పట్టనట్లు వ్వవహరిస్తురు. వర్షాలకు వడ్లు తడిస్తే కటింగ్ పెట్టి లాభం పొందచ్చనే నిర్వాహకులు వేచి చూస్తున్నారని బహిరంగానే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటివరకు 53 వేల క్వింటళ్ల ధ్యానం తరలించగా, ఇంకా 25వేల క్వింటాళ్ల ధ్యానం తరలించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.