Russia Cucumber : దోసకాయ ధరలు పెరిగితే మన దగ్గర పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, రష్యాలో అలాకాదు. దోసకాయ ధరల పెరుగుదల ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రస్తుతం రష్యాలో దోసకాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే.. ఒక కేజీ దోసకాయ మన కరెన్సీలో రూ.358 వరకు ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోసకాయ ధరల్ని నియంత్రించలేని ప్రభుత్వ వైఫల్యంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం దోసకాయల ధరలు రష్యాలో రెండు, మూడు రెట్లు పెరిగాయి.
ఒక కేజీ దోస 300 రూబుల్స్ పలుకుతోంది. ఇంతపెట్టి కొందామనుకున్నా కొనుగోలుకు పరిమితులు విధించారు. దోసకాయ ధరల పెరుగుదలకు కారణం ఉంది. అక్కడ ఇప్పుడు శీతాకాలం. ఈ సీజన్లో దోసకాయల ఉత్పత్తి తగ్గుతుంది. పైగా సాగుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ కారణాలతో ధరలు పెరుగుతున్నాయి. కానీ, మరో నెల రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి, దోసకాయల ధరలు అందుబాటులోకి వస్తాయని అక్కడి నాయకులు చెబుతున్నారు. గత డిసెంబర్ నుంచి దోసకాయ ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. దోసకాయల్ని రష్యన్లు ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ల రోజువారీ ఆహారంలో ఇవి భాగం. ముఖ్యంగా వాళ్లు ఎక్కువగా తినే సలాడ్లలో వాడుతారు. నిత్యావసరమైన దోసకాయ ధర మూడు రెట్లు, కొన్ని చోట్ల అంతకుమించి పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఏడాది కాలంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరగగా, ఇటీవల వ్యాట్ కూడా పెంచారు. దీంతో అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తంగా ధరలు 2.1 శాతం పెరిగినట్లు అంచనా. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. దీనికితోడు కొంతకాలంగా పెట్రోల్ ధరలు, కరెంట్ బిల్లులు, ఇంటి ఖర్చులు కూడా భారీగా పెరగడంతో ప్రజలు ఈ ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు రోజూ తినే దోసకాయ ధరలు కూడా పెరగడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణంగా రష్యా దోసకాయల్ని సొంతంగానే పండించుకుంటుంది. అరటిపండ్లను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ, ఇప్పుడు అక్కడ అరటి పండ్లకంటే దోసకాయల ధరలే ఎక్కువగా ఉన్నాయి. ఇక.. దోసకాయల ప్రభావం ఎలా ఉంది అంటే.. అక్కడ ఒక దినపత్రిక ప్రతి రోజూ పేపర్తోపాటు దోస విత్తనాల్ని కూడా సరఫరా చేస్తోంది.