ఎవుసానికి ఎదురీత తప్పడం లేదు. యాసంగి గండం గట్టెక్కడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న వాగులు, బోర్లు, బావులు.., సరిపడా అందని కరెంటు.., మరోపక్క పొట్టదశలో నెర్రెలువారి ఎండుతున్న వరి పొలాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నోట్లోకొచ్చిన పంట కళ్లముందే ఎర్రబారుతుంటే చేసేదేమీ లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరో రెండుమూడు తడులైతే చేతికొచ్చే పంటను పశువుల మేతకు వదిలి ఆశలు వదులుకుంటున్నారు.
– మహబూబాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ సబర్బన్ / డోర్నకల్/ఐనవోలు/ చిన్నగూడూరు/ ఎల్కతుర్తి
హనుమకొండ జిల్లాలో సాగు నీటి సరఫరా విషయంలో అధికారులు చేతులెత్తేశారు. జిల్లా వ్యవసాయ రంగానికి కాకతీయ కాల్వతోపాటు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందుతున్నది. అయితే, గత కొన్నేండ్లుగా పిల్ల కాల్వల నిర్వహణ గాలికి వదిలేయడంతో ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాకతీయ కాల్వ, పిల్ల కాల్వలు చెట్లతో నిండి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదు. దీంతో జిల్లాలో సాగవుతున్న లక్షా 50వేల ఎకరాల్లో వరి పంట, మరో 70 వేల ఎకరాల్లో ఇతర పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయి.
ఈ దశలో నీరు ఎక్కువ అవసరం. ఇప్పుడే సాగు నీటికి కటకట ఏర్పడడంతో రైతులు స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కడుతున్నారు. వాళ్లు నీటిపారుదల శాఖ అధికారులకు ఫోన్లు చేసినా, ఎప్పుడు నీటిని విడుదల చేస్తారో స్పష్టం చేయడం లేదు. మరో వారం పది రోజుల్లో సాగు నీరు సమృద్ధిగా అందని పక్షంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండి పోయే ప్రమాదం పొంచి ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎల్కతుర్తి మండలంలో యాసంగిలో 18,500 ఎకరాల్లో వరి, 2500 ఎకరాల్లో మక్క జొన్న సాగు చేశారు. అయితే, ప్రస్తుతం ఎండలు ముదిరి భూగర్భ జలాలు తగ్గిపోతుండడంతో చాలా గ్రామాల్లో వరి, మక్క పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు కొన్ని ఎకరాల్లో పంటలను వదిలేసి, నీళ్లు పారే అవకాశం ఉన్న వరకే పంటలు సాగు చేసుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఉదయం 6 గంటలకు కరెంటు ఇచ్చి సాయంత్రం 5 గంటలకు తీసేస్తున్నారు. దీంతో సాగుకు సరిపడా నీళ్లు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారు. చిన్నగూడూరు మండలంలోని పలు గ్రామాల్లో తరచూ కరెంటు వచ్చిపోతుండడంతో విద్యుత్ మోటర్లు కాలిపోతున్నాయి. మరిపెడ మండలంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉన్నది. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కురవి మండలంలోని గుండ్రాతిమడుగు, రాజోలు, నారాయణపురం గ్రామాల్లో సాగు నీరు అందక పొట్ట దశలో వరి పంట ఎండిపోతున్నది. గార్ల మండలం పాకాల ఏరు కింద 300 ఎకరాల్లో నోటికాడికొచ్చిన పంట ఎండిపోతున్నది.
బయ్యారం మండలంలోని పెద్ద చెరువు కింద సుమారు 1500 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా, సాగు నీళ్లు అందక ఎండిపోయి పరిస్థితి నెలకొన్నది. చివరి ఆయకట్టు వరకూ నీరు అందించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. డోర్నకల్ మండలంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకేరు, మున్నేరు వాగులు వట్టిపోయి.. వాటి కింద సుమారు 250 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఆకేరు వాగు ఎడారిలా మారడంతో చిన్నగూడూరు మండల కేంద్రంతో పాటు ఉగ్గంపల్లి, విస్సంపల్లి, జయ్యారం, మన్నెగూడెం తదితర గ్రామాల రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆకేరు ఆనకట్ట కుడికాల్వ తెగిపోయింది. ఇప్పటికీ మరమ్మతు చేయించకపోవడంతో వాగులో చుక్కనీరు నిల్వ ఉండడం లేదు. ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నారు.
ఐనవోలు : ఈ పసల్ ఉన్న పరిస్థతి ఎప్పుడూ లేదు. చెరువు బందుకే భూమి, బావి ఉంది. కానీ, బావిలో నీళ్లు లేవు. రెండు ఎకరాల్లో వరి, అర ఎకరం బీర, పది గుంటలు బెండ తోట పెట్టా. సరపడా నీళ్లు అందక పంటలన్నీ ఎండిపోతున్నయి. కాల్వల్లో నీళ్లు వస్తే చెరువులు నిండి, బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పొద్దంతా పది గుంట పొలం పారుతలేదు. గర్మిళ్లపల్లి మహాకాంళి గుడి వెనక తుమ్మవాయి బండ దగ్గర చాలామంది రైతులం వరి పంట సాగు చేశాం. నీళ్లు లేక నోట్లోకొచ్చిన పంట ఎండిపోతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కాల్వల్లో నీళ్లు విడిస్తే పంటలకు జీవి గంజి పోసినట్లవుతుంది.