నర్సింహులపేట ఆగస్టు 26 : కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెళ్లారితే బుక్కెడంత తిని.. సద్దికట్టుకుని పొలంబాట పట్టే రైతన్న.. తిండి, నిద్ర మానుకుని సొసైటీ ఆఫీసుల వద్ద యారియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. నాట్లేసి నెలదాటినా యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. సరిపడా స్టాక్ లేదని అధికారులు చేతులెత్తేయడంతో పంటపై రంది పెట్టుకున్నరు. అదను దాటితే పొలం ఆగమైతదని ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోవాలనే ఆరాటంతో.. మంగళవారం నర్సింహులపేటలో తెల్లవారుజాము నుండే సంఘం కార్యాలయానికి వెళ్లి.. యూరియా కోసం బిక్కు బిక్కు మంటూ రైతులు ఎదురుచూస్తున్నారు.
తుఫాన్ కారణంగా వర్షం కురుస్తుండడంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చలిలో వణుకుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక దశలో రైతులు అధికారులను పిఎసిఎస్ కార్యాలయం గేటు వద్ద అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి..కంటిమీద కునుకు లేకుండా పోయిందని కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కర్షకులు నిప్పులు చెరుగుతున్నారు.