జనగామ రూరల్, మార్చి3 : కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జనగామ మండలంలోని ఎర్రకుంటతండా, దుబ్బతండా, వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. రైతుల సాగు నీటి గోస విన్న ఆయన కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పంట పొలాలకు వెంటనే సాగునీరు అందించాలన్నారు.
లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. గతంలో కరంట్ పోకపోతే వార్త అని, ఇప్పుడు కరంట్ పోతే వార్త అని, గతంలో గంట కూడా కరంట్ పోలేదని, ఇప్పుడు ప్రతి అరగంటకు కరెంట్ పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర కాలంలోనే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేక ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించలేక పోతున్నదన్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకు లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.