యూరియా కోసం రైతులు నిత్యం యుద్ధం చేస్తున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బస్తాలు దొరక్కపోవడంతో మండిపడుతున్నారు. శుక్రవారం నర్సంపేట, కాటారం, కురవిలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో అన్నదాతలు రోడ్డెక్కారు. యూరియా అందించని కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నర్సింహులపేటలో బస్తాలు పక్కదారి పట్టాయని ఏవోను నిలదీశారు. కాగా, ఎరువు లేకపోవడంతో పంటలు సాగు చేసుడెట్లా.. అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎర్రబారుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 19 : నెల రోజులు దాటినా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు. నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ప్రధాన రహదారిపై బీఆర్ఎస్, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మాదన్నపేట గ్రామంతో పాటు నాగుర్లపల్లి, పర్శనాయక్‌తండా, భోజ్యానాయక్తండాలకు చెందిన వారు భారీగా తరలిరావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కాటారం గోడౌన్లో యూ రియా బస్తాలు ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదని అన్నదాతలు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
వీరికి బీఆర్ఎస్ యూత్ మం డలాధ్యక్షుడు రామిళ్ల కిరణ్, నాయకులు రామిళ్ల రాజబాబు, మానెం రాజబాపు, తదితరులు సంఘీభావం ప్రకటించారు. మొదట కూప న్లు రాసిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. సరిపడా యూరియా అందజేయాలని కురవి మండలం బలపాల గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుపై నిరసన వ్య క్తం చేశారు. నెల్లికుదురు సొసైటీలో యూరియా బస్తాలు తీసుకొచ్చేందుకు బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బొల్లు భరత్ బైక్‌పై వెళ్లగా అదుపు తప్పి పడిపోయాడు.
దీంతో ఆయకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నర్సింహులపేట మండల కేంద్రంలో యూరియా బస్తాలు పక్కదారి పట్టడంతో రైతులు ఏవోను నిలదీశారు. పీఏసీఎస్‌కు 655 బస్తా లు రాగా, సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో 36 బస్తాలు తక్కువ రావడంతో రైతులు ఆందోళ నకు దిగారు. తమ పేరున వచ్చిన బస్తాలు మాయం చేశారని ఏవో వినయ్‌కుమార్‌ను ప్రశ్నించారు.
విష యం తెలుసుకున్న డీఎస్పీ గండ్రాతీ మోహన్ రైతులతో మాట్లాడి యారియా లోడులో మొదటిగా డబ్బులు ఇచ్చిన వారికి బస్తాలు ఇస్తామని హా మీ ఇచ్చారు. గూడూరు మండల కేంద్రంలో యూరియా కోసం కలకత్తా తండాకు చెందిన బాలింత వాంకుడోత్ జమీల తన రెండున్నర నెలల చిన్నారితో క్యూలో నిలబడ్డారు. శాయంపేట మార్కెట్ యార్డు గోదాములో రైతులకు యూరియా పంపిణీ జరుగుతుండగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించగా, వారు తమ గోడును చెప్పుకున్నా రు. పొద్దటి నుంచి బస్తా కోసం టోకెన్లు తీసుకుని లైన్లో ఉన్నా దొరకలేదని చెప్పారు. 220 యూరియా బస్తాలే వచ్చాయని చెప్పడంతో 400కుపైగా ఉన్న రైతులకు ఎలా అందిస్తారని నిర్వాహకులను ప్రశ్నించారు. యూరియా బస్తా దొరకని రైతుల పేర్లు నమోదు చేసుకుని వారికి మళ్లీ తెప్పించి ముందుగా ఇవ్వాలని సూచించారు.