నల్లబెల్లి, జూలై 12: యూరియా కోసం నల్లబెల్లి మండల (Nallabelly) కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల రైతులు ఉదయం 6 గంటలకు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట యూరియా బస్తాలకు కోసం క్యూ లైన్లు కట్టారు. ఈ సందర్భంగా అన్నం ఆకారం లేకుండా పొలం పనులను వదులుకొని లైన్లలో నిలబడ్డప్పటికీ తమకు బస్తాలు లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లపాటు ఏ రోజూ యూరియా కొరత ఏర్పడలేదని, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజా పాలన పేరుతో అన్నదాతలను అరిగోశ పెడుతున్నాదని విమర్శించారు. ఎకరానికి సుమారు ఐదు బస్తాల యూరియా అవసరం ఉందని ప్రస్తుతం ఒక రైతుకు ఎకరాకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే తాము పంటలు ఎలా పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక రెండు బస్తాలకు ఒక నానో యూరియాను కట్టబెడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు రైతులు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ అధికారి బన్న రజితను వివరణ కోరగా ప్రస్తుతం మండలంలో పీఏసీఎస్ కార్యాలయానికి 800 బస్తాలు రాగా ఆగ్రోస్ సెంటర్కు మరో 400 బస్తాలు, మేడేపల్లి పీఏసీఎస్ కార్యాలయానికి మరో 400 బస్తాలు యూరియా ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉందని తెలిపారు. అయితే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి యూరియా అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకరాకు రెండు బస్తాల యూరియాను రైతులు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పంటలకు ఎక్కువ యూరియా వాడకానికి అలవాటు పడ్డారని తెలిపారు. యూరియా వాడకాన్ని తగ్గించి పంటలపై నానో యూరియాను స్ప్రే చేసుకోవాలని సూచించారు.