నర్సింహులపేట సెప్టెంబర్ 4 : పొలం పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతులు యూరియా(Urea) కోసం సాగుకు దూరమవుతూ అరిగోస పడుతున్నారు. అదునుకు ఎరువులు దొరకక పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నారు. అధికారులు టోకెన్లు ఇచ్చినప్పటికీ ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. చివరికి సహనం నశించి ఆందోళనలకు దిగుతున్నారు.
తమకు సరిపడా యూరియా బస్తాలు అందించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈక్రమంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ సొసైటీ కార్యాలయం వద్దకు
తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను లైన్లో పెట్టారు. సెక్టార్ వారీగా క్లూ లైన్లో ఏర్పాటు చేసినప్పటికి అందరికి బస్తాలు ఆందకపోవడంతో ఏవోను నిలదీశారు. ఏవోను ఎస్ఐ సురేశ్ పోలీసు వాహనంలో తీసుకవెళ్లారు.