మహదేవపూర్, ఆగస్టు 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలువురు రైతులు పంట రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేశారు. లిస్ట్‌లో తమ పేర్లు ఉన్నాయో? లేవో? తెలియక రెండు రోజులుగా మనోవేదనకు గురవుతున్నారు. ఈక్రమంలో ఏవో కార్యాలయానికి వచ్చిన రైతులకు రుణమాఫీపై సరైన సమాచారం అందకపోవడంతో పాటు సమయపాలన పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు.
రైతుల బాధలను పట్టించుకోవడం లేదని, కనీసం సరైన సమాచారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన రైతులకు రుణమాఫీ అయ్యేలా చూడాలని, అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. నేను మహదేవపూర్ యూనియన్ బ్యాంక్‌లో రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్న. వడ్డీ కూడా కట్టిన. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ.1.50 లక్షల రుణమాఫీ లిస్ట్‌లో పేరు వస్తుందని అనుకున్నప్పటికీ రాలేదు. ఇప్పుడు రూ.2 లక్షల మాఫీ దాంట్ల పేరు వచ్చిందా అని అడిగితే రాలే అంటాండ్రు. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నా పంట రుణం మాఫీ చేసి నన్ను ఆదుకోవాలి.
– తుంగల సమ్మయ్య, రైతు, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా