రుణమాఫీపై రేవంత్ సర్కారు తీరు అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. మొదటి విడత నుంచి సరైన సమాచారం లేక, మాఫీ వివరాలు తెలియక ఆగమైన రైతులకు మూడో విడుతలోనూ అదే నిరాశే ఎదురవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిగో చేశాం.. అదిగో చేసేశాం అంటూ ఆర్భాటంగా గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీలేదంటూ అర్హత ఉన్నా ఎందుకు చేయలేదంటూ భగ్గుమంటున్నారు.
శనివారం ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో పంట రుణమాఫీ కాని అన్నదాతలు కడుపుమండి రోడ్డెక్కారు. చాలాచోట్ల ఏవో కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపగా, సమాధానం చెప్పలేక దాటవేయడంతో అధికారులు తీరుపై వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ సర్కారు మొత్తం రుణమాఫీ చేయాలని లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 17
వర్ధన్నపేట, ఆగస్టు 17 : పూర్తిస్థాయిలో రుణమాఫీ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో శనివారం ‘నమస్తే తెలంగాణ’ పలువురు రైతులను కలిసి పంట రుణమాఫీ వివరాలను సేకరించింది. గ్రామానికి చెందిన సుమారు 30మంది రైతులకు రుణమాఫీ వర్తించ లేదని చెప్పారు. రూ.50వేల నుంచి రూ.లక్షలోపు 327 మంది, రూ.లక్ష నుంచి రూ. లక్షా50వేల లోపు 148 మంది రైతులకు రుణమాఫీ కా గా, రూ.లక్ష 50వేల లోపు 15మంది, రూ.2లక్షల లోపు 15మంది వరకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆధార్ నమోదులో తప్పులు, రేషన్ కార్డు వివరాలు సరిగ్గా లేక రుణమాఫీ కాలేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లంద గ్రామానికి చెందిన కర్కాటకపు స్వర్ణ, ఎద్దు రమేశ్, తక్కళ్లపెల్లి గోపిచంద్, సమ్మెట లక్ష్మీనారాయణ, పోశాల స్వప్న, పాకనాటి నర్సింహారెడ్డి తదితర రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో ఈవోను కలిసి ఫిర్యాదు చేశారు.