స్టేషన్ ఘన్పూర్ : వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇటు వర్షాలు పడక, అటు దేవాదుల కాల్వలు వెలవెలపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. వర్షాలు పడకపోయినా దేవాదుల కాల్వ ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్మకంతో నార్లు పోసుకున్న రైతులు ముదిరిన నారు చూస్తుంటే వారి గుండె తరుక్కుపోతుంది. మరో 15 రోజుల్లో కలుపు తీసే పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు ఇంకా మడులు కూడా దున్నుకోలేని పరిస్థితి ఉంది.
సాగు ఆలస్యం కావడంతో దిగుబడిపై తీవ్ర ప్ర భావం పడుతుందనే భయం వారిని వెంటాడుతోంది. కరువును మరిచిపోయాలా దేవాదులతో సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చి నా, రిజర్వాయర్ల నుంచి చుక్క నీరు పారింది లేదు, పొలాలు తడిసింది లేదని రైతులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దేవాదుల కాల్వలకు నీరు విడుదల చేయకపోతే ఈ సీజన్ పూర్తిగా చేతులెత్తేసినట్లేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు లేక పోవడంతో రైతులు పంటలు సాగు చేయడం లేదు. దీంతో మాకు పనుల్లేవు. ఐదుగురిని నాటు వేయడానికి రమ్మంటే 10 మందిమి పోతానం. వచ్చిన కూలీయే అందరం పంచుకుంటున్నాం. వర్షాలు లేకపోవడంతో మాకు కూడా జీవనోపాధి కరువైంది. పిల్లల స్కూల్ ఫీజులు, మహిళా సంఘాల చిట్టీలు కట్టడం కష్టంగా మారింది.
– రేణుక, వ్యవసాయ కూలీ, ఇప్పగూడెం
నాకు ఏడెకరాల పొలం ఉంది. ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా నాటు వేయలేదు. వర్షాలు లేక, కాల్వల్లో నీరు రాక పోవడంతో మడులను కూడా నాటుకు సిద్ధం చేసుకోలేకపోయాం. నాట్లు వేసుకోవడానికి ఇప్పటికే నెల ఆలస్యమైంది. దీంతో పంట దిగుబడి తక్కువ రావడమే కాకుండా, వచ్చే పంటకు కూడా ఆలస్యం అవుతుంది.
– మాలోత్ కరన్ నాయక్, రైతు, చంద్రుతండా
నాకు ఎనిమిదెకరాల పొలం ఉంది. నారు పోసి రెండు నెలలు దాటింది. అంతా ముదిరిపో తుంది. పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా నాటు వేయలే. కాల్వ, బోర్లు, బావుల్లో నీరు లేక నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి కాల్వకు నీరు వదిలి ఆదుకోవాలి.
– భూక్యా యాదగిరి, రైతు, మాన్ సింగ్ తండా