తాండూరు/పెద్దేముల్ ఆగస్టు 16: తాండూరు పట్టణంలోని విజయనగర్కాలనీలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల ( పెద్దేముల్)లో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ఆదివారం విద్యార్థులను చూసేందుకు తల్లిదండ్రులు రాగా ఈ ఉదంతం వెలుగు చూసింది. తాండూరు నియోజకవర్గం అగ్గనూర్కు చెందిన బాలాజీ (8వ తరగతి) తండ్రి చనిపోవడంతో స్థానిక బాలుర గురుకుల పాఠశాలలో తల్లి చేర్పించింది. శనివారం భోజన సమయంలో అదనపు చపాతీ అడిగినందుకు సీనియర్ విద్యార్థులు లోకేశ్ , మణికంఠ చపాతీ పెంకతో తన కాళ్లపై కాల్చారని బాలాజీ ఆరోపించాడు. బాలాజీకి జ్వరం వచ్చిందని ఉపాధ్యాయులు ఫోన్ చేశారని, పాఠశాలకు వస్తే ఈ విషయం బయటపడిందని విద్యార్థి తల్లి వాపోయింది. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా ఎలాంటి విచారణ చేయక పోవడం గమనార్హం. తనను పాఠశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన
కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. పాఠశాలలో ర్యాగింగ్ జరుగుతున్నా ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోక పోవడంవల్లే ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.