తొర్రూరు,మే 9: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్కెక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల రైతులు రెండు ట్రాక్టర్లలో ధాన్యంతో తొర్రూరులోని గాంధీ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యాన్ని తగులబెట్టి నిరసన తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గం అంతటా ఇదే పరిస్థితి ఉన్నా స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సేద్యం పిచ్చయ్యకు చెందిన ఆరెకరాల భూమిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా, భూమిని ఖాళీ చేయాలని చెబుతున్నాడని రైతులు వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వడ్లను ఎటు తీసుకెళ్లాలని వారు వాపోయారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి సంఘీభావం
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వారిని కలిసి సంఘీభావం తెలిపారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మయ్యతో ఫోన్లో మాట్లాడడంతో రెండు లారీలను పంపించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. బోనస్ చెల్లింపులో జాప్యం నెలకొనడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.