రియా కోసం అన్నదాతలు గోస పడుతున్నరు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎరువుల కోసం బారులు తీరినా దొరకకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నరు. విసిగి వేసారి పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఖాళీ చేతులతో ఇంటికి పయనమవుతున్నరు. తమ ఇబ్బందులు పట్టించుకోని ఇదేం ప్రభుత్వమని రైతులు శాపనార్థాలు పెడుతున్నరు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నరు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 20
యూరియా కోసం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతులు బారులు తీరారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అనేక చోట్ల రైతులు ధర్నా చేశారు. రైతుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఒక రైతుకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి, మల్యాల, రెడ్యాల, జంగిలికొండ, కొమ్ముగూడెంతండా రైతులు సొసైటీ ముందు పడిగాపులు కాశారు. సొసైటీ అధికారులు మాత్రం పోలీసులతో కలిసి రెండు రోజుల క్రితం ఇచ్చిన టోకెన్లకు యూరియా అందించారు. కనీసం టోకెన్లు ఇవ్వాలని సొసైటీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
దంతాలపల్లి మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు యూరియా కోసం ధర్నాకు దిగారు. ఎస్సై రాజు వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. బయ్యారం మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం వద్ద గంటల తరబడి ఉన్న రైతులకు తీరా రేపు రావాలని చెప్పడంతో సహనం నశించి అధికారులను నిలదీశారు. నర్సింహులపేటలోని భారతి ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంలోకి రైతులు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు లాఠీలు చూపుతూ అదుపు చేసే యత్నం చేశారు.
నెల్లికుదురు మండల కేంద్రంలోని సొసైటీ వద్ద 1000 మంది రైతులు రాత్రి 12 గంటల నుంచి వేచిచూడగా బుధవారం సాయంత్రం 444 బస్తాల యూరియా మాత్రమే రావడంతో సుమారు 556 మంది రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని సూరిపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసిన రైతులు బుధవారం ఉదయం నుంచే క్యూ కట్టారు. పంపిణీకి 444 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండగా ఒక్కో రైతుకు ఒక్కోటి మాత్రమే పంపిణీ చేశారు. నల్లబెల్లి మండలం మేడెపల్లి పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు భారీగా క్యూ కట్టారు. యూరియా దొరుకుతుందో లేదోనని రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రైతు లూనావత్ కిషన్ నాయక్ కాలుకు గాయాలయ్యాయి.
ఖానాపురం మండలంలోని బుధరావుపేట, మనుబోతులగడ్డ గ్రామాల పరిధిలోని సొసైటీ ఎరువుల గోదాంలకు యూరియా రావడంతో రైతులు బారులు తీరినా కొద్ది మందికే టోకెన్లు జారీ చేశారు. కొందరికి యూరియా లభించకపోవడంతో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యూలో నిల్చున్న రైతు అల్లీపాషా సొమ్మసిల్లి పడిపోయాడు. యూరియా కోసం కొందరు మహిళా రైతులు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడడం కనిపించింది. తొర్రూరులో అధికారుల కాళ్లు మొక్కిన రైతు ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.