Urea | బయ్యారం : వర్షంలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు సొసైటీ పంపిణీ కేంద్రంలో బుధవారం యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
తెల్లవారుజాము నుంచి గొడుగులు వేసుకొని క్యూ లైన్లో నిలబడి కేంద్రం వద్ద పడిగాపులు కాశారు. అయితే అనంతరం యూరియా లోడు వచ్చినప్పటికీ వర్షం కారణంగా పంపిణీ చేయలేని పరిస్థితి ఉండడంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. అయితే ఉదయం నుంచి వర్షంలో పడిగాపులు కాస్తున్న తమకు యూరియా ఎందుకు ఇవ్వరు అని రైతులు అధికారులను ప్రశ్నించారు. యూరియాను నిల్వ చేసేందుకు ఉప్పలపాడు కేంద్రంలో అనువుగా లేని దృష్ట్యా లారీ లోడును బయ్యారం తరలించేందుకు ప్రయత్నిస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు అడ్డుకున్నారు. ఇక్కడి నుండి యూరియా వెళ్తే తమకు దొరకదని, పంపిణీ చేయాలని అధికారులను కోరారు.
వర్షం దృష్ట్యా పంపిణీ చేయలేమని రైతులకు సర్ది చెప్పిన వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు యూరియాను బయ్యారం తరలించి నిల్వ చేశారు. ఈ క్రమంలో రైతుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అయితే తుఫాన్ ప్రభావం ఉందని తెలిసి అధికారులు యూరియా పంపిణీని ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కోసం పడిగాపులు కాస్తూ వర్షంలో తడిసి ముద్దయిన రైతులు నిరాశతో యూరియా లేకుండానే వెనుతిరిగారు.