చిన్నగూడూరు, ఆగస్టు 31 : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకెందుకు కాలేదని పలువురు రైతులు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం ఇండియన్ బ్యాంకు వద్ద శనివారం నిరసన తెలిపారు. ఇప్పటి వరకు తమ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకాలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొన్ని రోజులుగా బ్యాంకు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇండియన్ బ్యాంకు ఖాతాదారులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో రైతులు చంద్రబాబు, రాములు, చిన్నరాములు, సాయిబాబు, గోవర్ధన్, రామనాథం, కృష్ణ, భిక్షపతి, మల్లయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.