మహబూబాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. ఒకవైపు రైతు భరోసా రాక పెట్టుబడికి ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు పంట రుణం మాఫీ కాక ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల తప్పిదానికి అనేక మంది రైతులకు మాఫీ వర్తించక కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతి మడుగు (విలేజ్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో ఈ గ్రామానికి చెందిన 379 మంది రైతులు సభ్యులుగా ఉండి రుణాలు పొందారు.
వీరంతా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉన్నారు. అయితే ప్రభుత్వం మూడు విడతల్లో చేపట్టిన రుణమాఫీ కేవలం 35.88 శాతం.. అంటే కేవలం 136 మందికే జరిగింది. మిగిలిన 243 మంది తమకు మాఫీ ఎప్పుడైతదోనని ఎదురు చూస్తున్నారు. వీరిలో చాలా మంది రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నప్పటికీ అధికారులు అప్డేట్ చేయకపోవడంతో మాఫీ వర్తించలేదు. మరికొంత మంది పేర్లు తప్పుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సంఘంలోని అధికారులు, సిబ్బంది చేసిన తప్పులను సవరించి తమకు రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మా ఊర్లో నా పేరు మీద రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆరేళ్ల క్రితం తీసుకున్న పంట రుణానికి మిత్తి కడుతూ రెన్యువల్ చేసుకుంటున్నా. గతేడాది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా నాకు రూ. 60 వేలు ఒకేసారి మాఫీ అయ్యింది. ప్రస్తుతం నాకున్న రూ. 37,600 రుణం మాఫీ కాలేదు. ఎందుకు కాలేదని సొసైటీ సార్లను అడిగితే పేరు తప్పుందని చెబుతున్నారు. ఇన్నేళ్లు లేని తప్పు ఇప్పుడెట్లా నమోదైంది. అధికారులే సమాధానం చెప్పాలి. నాకు అధికారులు, ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలి. -వేల్పుల ఉపేందర్, రైతు, గుండ్రాతి మడుగు (విలేజ్)