మహబూబాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ధాన్యం డబ్బుల కోసం దైన్యంగా ఎదురు చూడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి.
కానీ, ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చెల్లించకపోవడంతో పడరాని కష్టాలు పడుతున్నారు. వడ్లు అమ్మిన పైసలు రాక పెట్టుబడికి తెచ్చిన అప్పులు, కూళ్లు, రవాణా ఖర్చులు చెల్లించే స్థోమత లేక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. జిల్లాలో 239 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 23,350 మంది రైతుల నుంచి 1,06,905 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
వీటి విలువ రూ.247.88కోట్లు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు 15,587 మంది రైతులకు 71,284 మెట్రిక్ టన్నులకు రూ.165.25 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా 7,763 మంది రైతులకు రూ.82.63 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా ఒకవైపు రుణమాఫీ కాకున్నా, మరోవైపు రైతుభరోసా అందకున్నా అప్పులు తెచ్చి పంట పండిస్తే, వాటికి కూడా ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పౌరసరఫరాల సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం డబ్బులు సకాలంలో అందజేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ నెల 15న కల్వలలోని కొనుగోలు కేంద్రంలో 8 క్వింటాళ్ల సన్నరకం ధాన్యానికి కాంటాలు వేశారు. 14 రోజుల క్రితమే బస్తాలు ఎగుమతయ్యాయి. రెండు రోజుల్లో పైసలు పడుతాయని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు పైసా కూడా బ్యాంకు ఖాతాలో పడలే. మరి ప్రభుత్వం ఇచ్చే బోనస్‌కు ఇంకెన్ని రోజులు ఆగాలో అర్థం కావడం లేదు. యాసంగి పెట్టుబడి కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
-చిర్రగానే చిన్ననారాయణ, రైతు, కేసముద్రం