నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 11 : సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద యూరియా కోసం రైతుల అవే బాధలు.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటిపర్యంతమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు పడినా ఒక్క బస్తా దొరకని దుర్భర పరిస్థితి.
నెల రోజులుగా వారు అనుభవిస్తున్న గోస నేటికీ తీరడం లేదు. యూ రియా అందించని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నదాతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో రోడ్డెక్కి వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. జఫర్‌గఢ్‌లో ఆందోళన చేసి, అధికారులను నిలదీశారు. పర్వతగిరిలో ధర్నా చేసి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూరియా కోసం అన్నదాతలు ఆరిగోస పడుతున్నారు. తిండీతిప్పలు, నిద్రాహారాలు మాని అర్ధరాత్రి నుంచి చీమ్మ చీకట్లో లైన్లు కడుతున్నారు. నెలల తరబడి యూరియా కోసం తిరుగుతుంటే వ్యవసాయ పనులు వెనుకబడి పోతున్నాయని, సమయానికి పంటలకు ఎరువు వేయక పోవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లోని సొసైటీ గోదాము వద్దకు వేలాది మంది రైతులు యూరియా కోసం తరలివచ్చి గురువారం మధ్యాహ్నం వరకు క్యూ కట్టినా లారీ రాలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురై నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. దీంతో ఎక్కడి వా హనాలు అక్కడే నిలిచిపోయా యి. అక్కడికి వచ్చిన నర్సంపేట రూరల్ సీఐ సాయిప్రసాద్, ఖానాపురం ఎస్సై రఘుపతితో వా గ్వాదానికి దిగారు. ఖానాపురం మం డల కేంద్రంలోని రైతు వే దిక వద్ద నిరసన వ్యక్తం చేస్తు న్న రైతులకు మా జీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్ రావు తో పాటు బీఆర్ఎస్ నాయకు లు మద్దతుగా నిలిచారు. జఫర్‌గఢ్ పీఏసీఎస్ వ ద్ద అన్నదాతలు ఆందోళన చేపట్టా రు.
సొసైటీకి 220 బస్తాలతో యూరియా లారీ రాగా, అధికారులు 110 మాత్రమే అన్లోడ్ చేసి మరో 110 బస్తాలను మండలంలోని హిమ్మత్‌నగర్‌కు తరలించే యత్నం చేశారు. గమనించిన రైతులు లారీ ఎదుట బైఠా యించారు. దీంతో పోలీసులు, వ్యవసాయాధికారులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. పర్వతగిరి మండల కేంద్రంలో ఉదయం నుంచి పడిగాపులు కాసినా యూరియా దొరకకపో వడంతో అన్నదాతలు ధర్నాకు దిగారు.
రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 440 బస్తాల యూరియా లారీ వరంగల్ నుంచి కేసముద్రం వస్తుండగా డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడుపలేక కేసముద్రం విలేజి గ్రామ సమీపంలో నిలిపివేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలపగా, కానిస్టేబుల్ అలీం లారీని తీసుకొచ్చాడు. ఐనవోలు మండ లం కొండపర్తి సొసైటీ వద్ద ఒక యూరియా బస్తాకు ఒక నానో యూరియా కూడా తీసుకోవాలని చెప్ప డంతో రైతులు ఆగ్రహించారు. నానో యూరియా డబ్బాలు పగులకొట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఏడీఏ అదిరెడ్డి, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్ అక్కడికి చేరుకొని నానో యూరియా లింక్ చేయకుండా యూరియా ఇస్తామని చెప్పారు.