ఇల్లెందు, ఫిబ్రవరి 16 : ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు హైదరాబాద్ శిబిరంలో ఉండడం, ఎన్నికల అధికారులు ఇచ్చిన సమయానికి వారు రాకపోవడంతో, సమయానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నికల అధికారి, కొత్తగూడెం ఆర్డీఓ మధు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 19 మంది, ఇండిపెండెంట్లు ఇద్దరు హైదరాబాద్ కాంగ్రెస్ శిబిరంలో గత రెండు రోజులుగా ఉండడం, ఈ రోజు ఉదయం 11 గంటల వరకు రాకపోవడంతో ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం సమయానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు పింగిలి అనూహ్య, దండు సారయ్య, పాబోలు స్వాతి చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అధికారి కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్లకు మధ్యాహ్నం 1:30 వరకు సమయం ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లను వార్డుకు చెందిన పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పింగిలి నరేష్, పాబోలు కిరణ్, విజ్ఞాన్, పలు వార్డుల సభ్యులు పాల్గొన్నారు.

ఇల్లెందులో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం