నర్సింహులపేట/డోర్నకల్, ఫిబ్రవరి 2: ఎండిన వాగులతో పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. దీంతో ఆకేరు, మున్నేరు వాగు పరీవాహక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నర్సింహులపేటలో భారీ వర్షాలతో చెక్ డ్యాం తెగిపోవడంతో వాగులో చుక్కనీరు లేదు. దీంతో రబీ సాగు చేస్తున్న అన్నదాతలకు నిరాశ తప్ప డం లేదు. ఓవైపు ఆకేరువాగులో చుక్కనీరు లేక పోవడం, వాగును నమ్ముకుని యాసంగి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఎస్సారెస్పీ నీరు కాల్వ తడిసే వరకే నీరు వస్తుండడంతో చెరువులు, కుంట లు, వాగులోకి నీరు వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు చిన్నగూడూరు అనకట్ట తెగిపోవడం, ఇటు ముంగిముడుగు శివారులో ఆకేరు వాగుపై నిర్మాణం చేసిన చెక్‌డ్యాం తెగిపోవడంతో వాగు ఎండిపోయింది. దీన్ని అసరగా చేసుకొని ఇసుక అక్రమ రవాణ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
వాగులో నీరు లేకపోవడంతో యాసంగి వరి సాగు చేయలేక ముంగిమడుగు, ఫకీర తండా శివారులో వరి సాగు చేయకుండా వదిలేశారు. అదేవిధంగా డోర్నకల్ శివారులో ప్రవహిస్తున్న మున్నేరు వాగు వేసవి కాలం రాకముందే పూర్తిగా ఎండిపోయింది. నీరు ఇంకిపోయి రాళ్లు బయటకు తేలాయి. దీంతో వేసవి వరి పంట సాగు చేసిన మున్నేరు వాగు పరీవాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే మున్నేరు వాగులో నీరు లేకపోవడంతో జంతువు లు, పక్షుల తాగు నీటికి కష్టంగా మారింది.