దామెర, జూన్ 11: వరంగల్ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ వద్ద విజయవాడ- నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకోసం హద్దుల స్ట్రెచ్చింగ్( కందకం) పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. పోలీసుల పహారాలో పనులను చేయించేందుకు రెవెన్యూ అధికారులు జేసీబీని తీసుకువచ్చి బలవంతంగా పనులు చేస్తుండగా బొల్లు రాజిరెడ్డితో పాటు మరికొంతమంది రైతులు అడ్డు తగిలి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్నాయి.
ఎట్టకేలకు పోలీసులు రైతులను సముదాయించి స్ట్రేచింగ్ ( కందకం) పనులను చేయించారు. ఈ సందర్భంగా రైతులు బొల్లు రాజిరెడ్డి, బొల్లు సమ్మిరెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూములకు ఎకరాకు రూ.4 కోట్ల వరకు ధర పలుకుతున్నదని, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.80 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పడం రైతులను నట్టేట్ట ముంచడమేనని అన్నారు. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం చరిత్రలో నిలబడలేదని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతులను న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చి ఇలా రైతులను మోసం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, బలవంతంగా తమ భూములను లాక్కుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు, దామెర, ఆత్మకూరు ఎస్ఐలు కొంక అశోక్, సతీష్ పాల్గొన్నారు.