తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎసిఎస్ వద్ద యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే రైతులు యూరియా కోసం పిఎసిఎస్ వద్ద క్యూ కట్టారు. అయితే అక్కడికి కేవలం 44 బస్తాల యూరియా మాత్రమే రాగా, వేలాది మంది రైతులు యూరియా కోసం ఎదురుచూడటం ఉద్రిక్తతలకు దారితీసింది.
ఈ సందర్భంగా ఎస్సీఎస్ సిబ్బంది పోలీసులు సహకారంతో పంపిణీ చేపట్టారు. ఆగస్టు 15న రైతుల ఆధార్ కార్డులు సేకరించిన ఎస్సీఎస్ సిబ్బంది ఇప్పుడు అవి కనిపించడం లేదంటూ గందరగోళానికి తెరతీసారు.
దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు జోక్యం చేసుకుని గొడవను అదుపులోకి తీసుకువచ్చారు. ఆధార్ కార్డులు లేని రైతులకు కూడా చివరికి యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
రైతులు మాట్లాడుతూ గత పది రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికి ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఆధార్ కార్డులను 50 మందికి ఒక గ్రూపుగా విడదీస్తూ పోలీసుల పహారాలో టోకెన్లు ఇస్తూ యూరియా పంపిణీ జరగడం విశేషం. ఈ కార్యక్రమంలో తొరూరు వ్యవసాయ అధికారి రాంనర్సయ్య, ఎస్సై గొల్లమూడు ఉపేందర్, అదనపు ఎస్సై శివరామకృష్ణ, ఏఈఓలు, కానిస్టేబుళ్లు, ఎస్సీ ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.