నల్లబెల్లి, జూలై 07: నల్లబెల్లి (Nallabelly) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయకపోవడం ఏమైనా చర్య అని రైతులు వాపోతున్నారు. ఒక్కో బస్తాకు ఒక నానో యూరియాను కట్టబెడుతూ రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు యూరియా కొరత రాలేదని నేడు వ్యవసాయ పనులన్నీ పక్కనపెట్టి ఎరువుల దుకాణాల ఎదుట నిలబడిన ఒక్క బస్తా యూరియా కూడా లభించడం లేదని చిన్న తండా కు చెందిన మహిళ రైతు అజ్మీర విజయ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు కనీసం అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న తమకు యూరియా అందించకపోవడం పట్ల రేవంత్ సర్కారు పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.