రాయపర్తి, ఆగస్టు 2: రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. వరి, పత్తి, మక్కజొన్న, జొన్న తదితర పంటలకు మొదటి దఫాలో వేయాల్సిన యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఒక్క బస్తా లభించడం లేదని వాపోతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాల కోసం అన్నదాతలు వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాలకు 2500 టన్నుల యూరియా అవసరముండగా శుక్రవారం వెయ్యి బస్తాలు మాత్రమే వచ్చాయి.
విషయం తెలుసుకున్న రైతులు కూపన్ల కోసం పోటీపడి గోదాం వద్ద బస్తాలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కాగా ‘కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు యూరియా కొరత లేదని, ఏనాడూ క్యూకట్టిన సందర్భాలూ లేవని..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కొరత మొదలైంది’ అని బారులు తీరిన పలువురు రైతులు పేర్కొన్నారు. ఈ విషయమై ఏవో గుమ్మడి వీరభద్రంను వివరణ కోరగా పూర్తిస్థాయిలో యూరియా నిల్వలు లేవని, త్వరలోనే తెప్పిస్తామన్నారు.
యూరియా బస్తాల కోసం మళ్ల ఎనుకటి రోజు లు ముందర పైడ్డె. గత పందేడ్ల కాలంల యూ రియా మా ఊళ్లల్లనే దొరికేది. ఇప్పుడేమో మండలకేంద్రంలోని ప్రైవేట్ దుకాణాలల్ల కూడా దొరుకడం లేదు. యూరియా కోసం సమీప మండలాలు కూడా తిరిగినం. యూరియా లేకుంటే పంటలు పండవాయే. కొందామంటే దొరుకతలేవాయే. ఏం చేయా ల్నో.. ఏమో అర్థం కావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు రైతుల గోసను జర పట్టించుకోవాలి.
– ఎర్ర లింగయ్య, మహబూబ్నగర్, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా