నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 17 : యూరియా కోసం అవే బారులు.. అవే బాధలు రైతుల కు తప్పడం లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు జాగారం చేసి క్యూలో నిల్చున్నా ఎరువు అందని పరిస్థితి నెలకొంది. గంటల కొద్దీ వేచి ఉన్నప్పటికి ఒక బస్తా కూడా అందక నిరాశతో వెనుదిరిగి పోతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలోని ఆగ్రోస్ వద్ద యూరియా ఇస్తారన్న సమాచారంతో రైతులు బుధవారం ఉదయం 6గంటలకే చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట దాటినా యూరియా అందించకపోగా, రేపు ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎస్సై వినయ్ కుమార్ వారికి నచ్చచెజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు రైతులకు యూరియాను అందించారు. బయ్యారం మండలంలో యూరియా కోసం ఆటో లో వెళ్తుండగా ప్రమాద వశాత్తు బోల్తా పడడంతో పది మంది రైతులకు గాయాలయ్యాయి. మండ లంలోని గురిమళ్ల రైతులు యూరియా కోసం తెల్లవారుజామున ఉప్పలపాడుకు ఆటోలో బయలుదేరా రు. గురిమళ్ల-కంబాలపల్లి గ్రామాల మధ్య ఆటో బోల్తా కోట్టింది. డ్రైవర్‌తో సహా 12 మంది ప్రయా ణిస్తుండగా 10 మంది గా యాల పాలయ్యారు. వీరిని హుటాహుటిన 108లో మహబూబాబాద్ ఏరి యా ఆసుపత్రికి తరలించా రు. బోడ కిషన్, గలిగి సారమ్మ, వజ్జ సూరమ్మ, బోడ లక్ష్మి, మాలోత్ లక్ష్మి, మాలోత్ వస్య, మాలోత్ మంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యా యి.
కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు పరామర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా కూడా అందించలేని దుస్థితిలో ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని సూచించారు. వారి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాత గణేశ్, గంగుల సత్యనా రాయణ, మురళీకృష్ణ, శ్రీను, వజ్జా భద్రయ్య, రామారావు తదితరులు ఉన్నారు. కాగా, ఆటో ప్రమా దంలో గాయపడిన రైతులకు పోలీసులు అండగా నిలిచారు. వారి ఇంటికి వెళ్లి యూరియా బస్తాలు అందించారు.
మాకు ఏడెకరాల భూమి ఉంది. వారం రోజులు తిరిగితే ఒక్క బస్తా దొరికింది. మక్కజొన్న తల సుంచుకు వచ్చింది. వరి పొట్ట దశలో ఉంది. వాటికి యూరియా ఎప్పుడు వేయాలి? యూరియా కోసం ఉదయం నాలుగున్నరకు చద్దన్నం, మామిడికాయ పచ్చడి పట్టుకుని రెండు కిలోమీటర్లు నడిచి బస్టాండు వరకు వచ్చినం. కల్వర్టు పైనుంచి నీళ్లు పోతుంటే ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని వాగు దాటించిండ్లు.
– రబియా, రైతు, సముద్రాల, స్టేషన్‌ఘన్‌పూర్