వానకాలం మొదలై నెలన్నర గడిచింది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు గట్టి వర్షం పడక జలాశయాల్లోకి నీరు చేరలేదు. బోర్లు, బావుల్లో ఉన్న నీరు ఇంకిపోయింది. అడపా దడపా కురిసిన వర్షానికి వేసిన పత్తి, పెసర, మక్కజొన్న తదితరు ఆరుతడి పంటలు నీళ్ల కోసం తండ్లాడుతున్నాయి.
బోర్లు, బావులను నమ్ముకొని పోసుకున్న వరి నార్లు ఎండలకు అల్లాడిపోతున్నాయి. అక్కడక్కడా నాట్లు వేసిన పొలాలు ఇప్పుడు నోళ్లు తెరుస్తున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొత్తగా బోర్లు, బావులు తవ్వుతూ, ఉన్న వాటికి పూడిక తీస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాభావ పరిస్థితులెదురైనా గోదావరి జలాలను ఎత్తిపోయని కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
శాయంపేట, జూలై 18 : ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బావులు అడుగంటిపోయాయి. వేసిన పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు, తక్కువ నీళ్లున్న బావుల నుంచి రైతులు బావుల్లోకి నీటిని మళ్లిస్తూ నింపుతున్న దృశ్యాలు శాయంపేటలో కనిపిస్తున్నాయి. రైతు లక్ష్మయ్య నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని పసుపు, పత్తి పంటలను సాగు చేస్తున్నాడు.
బావిలో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో అర కిలోమీటరు దూరంలో ఉన్న ఓ బావి నుంచి పైపులు వేసి తన బావిలో నీటిని నింపి పంటలకు నీరు పారిస్తున్నట్లు చెప్పారు. పత్తి, పసుపు పంటల సాగుకు ఇప్పటికే రూ.50 వేలకు పైగా ఖర్చు చేసినట్లు రైతు తెలిపారు. బావిలోనే నీళ్లు ఉండాలని ఉద్దేశంతో పైపులు వేసి అదనపు ఖర్చు చేసి నీటిని నింపుకుంటున్నట్లు చెప్పాడు.