జనగామ/ములుగు/జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ, మే 14 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. కల్లాలు, రోడ్లపై ఆరబోసుకొని అమ్మకం కోసం దిక్కులు చూస్తున్నాడు. అవసరమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. ఏర్పాటు చేసిన వాటిలో క్రయ విక్రయాలు జరగక నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఒకవైపు గన్నీ సంచుల కొరత.. మరోవైపు అందుబాటులో లారీలు లేక రోజుల తరబడి కాంటాలు కాక కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నత్తనడకన క్రయ విక్రయాలు సాగుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. నెల రోజులవుతున్నా సెంటర్లకు చేరిన ధాన్యంలో సగం కూడా అధికారులు కొనకపోవడంతో దిగాలు చెందుతున్నాడు. వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని బిక్కుబిక్కుమంటున్నాడు. దీనికి తోడు తేమ, తాలు పేరిట ధాన్యంలో కోత పెడుతుండడంతో మరింత ఆవేదనకు గురవుతున్నాడు. అలాగే మక్కల కొనుగోళ్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిరీక్షిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం అన్నదాతను ఆగ్రహానికి గురిచేస్తున్నది.
మిల్లులకు చేరేదెప్పుడో?ల్లో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాలు జరుగుతాయని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లకు 2.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 16,451 మంది రైతుల నుంచి 72,476.100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,111.090 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించి 9,194 రైతుల ఖాతాల్లో రూ.115 కోట్లు జమచేశారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా మునుపెన్నడూలేని రీతిలో మక్క రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కష్టపడి తాము పంట పండిస్తే ఈ కాంగ్రెస్ ప్రభు త్వం కనీసం కొనుగోలు చేయడానికి కూడా చేతకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా లో మక్కజొన్న రైతుల వద్ద దాదాపు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ఉన్నాయని అంచనా వేసిన అధికారు లు, 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వీటిలో ఇప్పటి వరకు దాదాపు రూ. 80 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా, ఇటీవలే ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యంతో మార్క్‌ఫెడ్ అధికారిపై వేటు వేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మక్క రైతుల ఆం దోళనలు వరంగల్‌లో ఎక్కువ కావడంతో ఇతర జిల్లాల నుంచి అధికారులు రావడానికి వెనకాడుతున్నారు. దీంతో కరీంనగర్ మార్క్‌ఫెడ్ డీఎంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
హనుమకొండ జిల్లాలో ఈ యాసంగిలో 1,24,480 ఎకరాల్లో వరి సాగు చే యగా 2,70,444 మెట్రిక్ టన్నుల ధా న్యం దిగుబడి వస్తుందని అధికారులు అం చనా వేశారు. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు 9,317 మంది రైతుల నుంచి 49,380.320 మె ట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 37 మిల్లలుకు తరలించినట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. వీటిలో గ్రేడ్-ఎ రకం 21,682.240 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 26,260.920, ఫైన్ రకం 1,437.160 మెట్రిక్ టన్నులు ఉన్నాయి.
మొత్తం రూ. 117,44,43,661 విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 93,51,78,791.20 నగదును 8,246 మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. కాగా, హనుమకొండ జిల్లాలో మొత్తం 154 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 130 సెంటర్లను అధికారికంగా ప్రారంభించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో పంటలను పెట్టుకొని రైతులు భయం గుప్పిట్లో ఉంటున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చి అమ్ముకుంటే రైస్ మిల్లర్లు సైతం కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నెలరోజుల క్రితం అధికారులు ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ధాన్యాన్ని లిప్టు చేయడంలో విఫలమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మొత్తం 45,000 మెట్రిక్ టన్నుల మక్కజొన్నను కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఏడు సెంటర్ల ద్వారా సుమారు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అతికష్టం మీద కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి నెల కావస్తున్నా ఇంతవరకు రైతులకు డబ్బులు అందలేదు.
ఒక్కో గన్ని సంచికి రూ. 30 వెచ్చించి కొనుగోలు చేసుకుంటున్న రైతులకు సంచుల డబ్బుల చెల్లింపు ఊసే లేదు. అలాగే జిల్లాలో జిల్లాలోని 12 మండలాల్లో లక్షా 60 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 12 వేల టన్నుల వడ్లను 110 కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేశారు. నెలరోజులు దాటుతున్నా ఇప్పటి వరకు 30 శాతం ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని, ధాన్యం వర్షం పాలైతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతులు హెచ్చరిస్తున్నారు.
ములుగు జిల్లాలో వడ్లు పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. రైతులకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పాటు ప్రారంభించిన సెంటర్లలో తగిన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో నెల రోజులుగా మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లాలోని 10 మండలాల్లో 149 కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల సభ్యులు, గిరిజన కోఆపరేటివ్, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. యాసంగి సీజన్లో 1.08 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 31 వేల టన్నులు మాత్రమే సేకరించి రైతుల ఖాతా ల్లో రూ.45 కోట్లు జమ చేశారు. రెండు లక్షల గన్నీ సంచులను సరఫరా చేశారు.
అకాల వర్షాలతో పలు కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు, రైస్ మిల్ల ర్లు కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాకు రూ.6 నుంచి 8 కిలోల వరకు కోతలు విధిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కోతలకు ఒప్పుకుంటేనే సంచులిచ్చి, కాంటాలు పెట్టి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. సన్న ధాన్యం పండించిన రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడకుండా కోసిన వడ్లను పొలాల నుంచే ప్రైవేటు రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.