మహబూబాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) హనుమకొండ సబర్బన్ : యూరియా కొరత రైతన్నకు చుక్కలు చూపిస్తున్నది. సాగు పనులు మానుకొని తెల్లవారుజాము నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాసినా ఒక్క బస్తా కూడా దొరకడం గగనం అవుతోంది. అలాగే మహబూబాబాద్ జిల్లాకు 40,500 మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇప్పటివరకు 18,100 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అలాగే హనుమకొండ జిల్లాకు గతేడాది 29,174 మెట్రిక్ టన్నుల యూరియా వస్తే.. ఈసారి ఇప్పటివరకు కేవలం 16,943 మెట్రిక్ టన్నులే వచ్చిందంటే కొరత ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతున్నది.
గతంలో మాదిరిగా బఫర్ నిల్వలు లేకపోవడంతో చేతులెత్తేసిన అధికారులు.. ‘సొసైటీకి స్టాక్ వచ్చినప్పుడే ఇస్తాం’ అన్నట్లు వ్యవహరించడం అన్నదాతల్లో ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నది. సరిపడా యూరియా ఇవ్వాలంటూ కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తూ కాంగ్రెస్ సర్కారు వైఫల్యంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే వారం క్రితం ఉమ్మడి జిల్లాకు రావాల్సిన యూరియా వ్యాగన్ వరుస సెలవుల కారణంగా ఇప్పటివరకు రాకపోగా అధికారుల సోమవారం రాత్రి వస్తుందంటున్నా గ్యారంటీ అయితే లేదు.
నిల్వల్లేక.. అంతటా నిరసనలు
మానుకోట జిల్లాకు 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 18,100 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో యూరియా కటకట తీవ్రంగా నెలకొంది ఒక ఆగస్టు నెలలోనే యూరియా రైతులకు 15వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుం ది. ఈ నెలలో ఇప్పటివరకు కేవలం 4,850 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. మహబూబాబాద్ జిల్లాకేంద్రంతో పాటు 18 మండలాల్లో యూరియా నిల్వలు లేకుండా పోయాయి. ఐదారు రోజులకు వచ్చే అరకొర యూరియాతో వేలాది మంది రైతులకు పంపిణీ చేయడమూ సిబ్బందికి కష్టంగా మారింది.
దీంతో ఏ సొసైటీ వద్ద చూసినా నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రైతులు రోడ్డెకి యూరియా కోసం ధర్నా చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. వచ్చిన యూరియా రైతులకు అరకొరగా సరఫరా చేయడంతో సరిపోవడం లేదు. ఈ ఏడాది వానకాలంలో 2,2,1282 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటివరకు 1.16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. వరితో పాటు ఇతర పంటలకు కూడా ప్రస్తుతం యూరియా అవసరం ఎంతో ఉంది. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదికలు పంపామని, వచ్చిన యూరియా వచ్చినట్టు రైతులకు పంపిణీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లా కలెక్టర్ గత కొద్దిరోజులుగా సెలవులో ఉండడం వల్ల కూడా సమస్య మరింత జటిలంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
గత నెలలో వర్షాలు అంతంత మాత్రమే కురవడం వల్ల వరి నాట్లు మామూలుగా రైతులు వేస్తూ వచ్చారు. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో నాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 31తో వరినాట్ల ప్రక్రియ పూర్తికానున్నాయి. అయితే ఇదివరకు వేసిన నాట్లతో పాటు ప్రస్తుతం వేస్తున్న వరి నాట్లకు యూరియా అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు లక్షా 30వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇప్పుడు రెండో దఫా యూరియా వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
వరికి తప్పనిసరిగా యూరియా వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జిల్లా సగం ఆయకుట్టుకు ఆయవుపట్టు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండింది. నేడో, రేపో కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి కూడా యూరియా పెద్ద ఎత్తున అవసరం పడుతుంది. ఈ తరుణంలో యూరియా అసలే లేకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బంది పరిస్థితి ఏర్పడే అవకాశమున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.