యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు కుతకుతలాడారు. తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నా ఎరువు అందకపోతుండడంతో సర్కారుపై దుమ్మెత్తి పోశారు. గురువారం పలు చోట్ల ధర్నా లు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని, వారికి సోయి లేదా అని విమర్శించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 21 : యూరియా బస్తాల కోసం రైతుల నిరీక్షణ తప్పడం లేదు. ఉదయం నుంచే మహబూబాబాద్ సొసై టీ ఎదుట పర్వతగిరి, రెడ్యాల, జంగిలికొండ, మల్యాల రైతులు బారులు తీరారు. మూడు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా ఇప్పటికీ యూరియా బస్తాలు ఇవ్వలేదని బైఠాయించారు. స్టాక్ రాలేదని అధికారులు తేల్చి చెప్పడంతో అక్కడే పడిగాపులు గాశారు. కురవి సొసైటీకి 444 బస్తాలు, గుండ్రాతిమడుగు సొసైటీకి 222 బస్తాల యూరియా రాగా వేలాది మంది రైతులు వచ్చారు. పోలీసులు రైతులను క్యూలో ఉంచి పంపిణీ చేశారు.
ఎరువు బస్తాలు రైతులకు సరిపోకపోవడంతో రైతులు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ వెళ్లిపోయారు. బయ్యారం మండలం గంధంపల్లిలో పోలీసు పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఎవుసం పనులు వదిలిపెట్టి యూరియా కోసం తిరగాల్సి వస్తుందని, అయినా దొరకడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గార్లలో క్యూలో ఉన్నసగం మందికే యూరియా ఇచ్చి మిగిలిన రైతులను బయటకు పంపించారు. వారు ఆందోళన చేయగా ఎస్సై సర్ది చెప్పి పంపించారు. మరిపెడ కేంద్రంలో యూరియా కోసం రైతులు ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం ఆగ్రోస్ కేంద్రాన్ని తెరిపించడంతో రైతులు క్యూ కట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగి బుర్కితండా గ్రామపంచాయతీ పరిధిలోని మల్లమ్మ కుంట తండాకు చెందిన వృద్ధుడు అజ్మీరా లక్కు మెట్లపై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్కుకు గతంలో పక్ష వాతం ఉండగా, అదే బాధలో వేసిన పంట పో తుందని యూరియా కోసం వచ్చి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.
దంతాలపల్లిలో పీఏసీఎస్ గోదాం కు రైతులు పెద్ద సంఖ్యలో రాగా అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున అందించారు. పెద్దవంగర మండల కేంద్రం, చిన్నవంగర సొ సైటీ రైతు బజార్ వద్ద రైతులు బారులు తీరారు. చిన్నగూడూరు మండలంలోని జయ్యారం రైతు వేదికకు రైతులు పెద్దసంఖ్యలో తరలిరాగా, వ్యవసాయాధికారులు ఒకటే కూపన్ ఇస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘానికి యూరియా లోడ్ రాగా, కొద్ది మందికి ఇవ్వగా, సుమారు 300 మంది రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.