రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి లైన్లలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్ వద్ద లైన్లలో నిలబడినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. నాట్లకు యూరియా పోటుతో సగానికి సగం దిగుబడి తగ్గుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద అధికారులు టోకెన్లు ఇవ్వడంతో శుక్రవారం పెద్ద సంఖ్య లో మహిళలు లైన్ కట్టారు. సాయంత్రం వరకూ యూరియా అందించకపోవడంతో వారు తీవ్ర ఘర్షణ పడ్డారు. పక్కన ఉన్న రైతులు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇద్దరు మహిళలు విపరీతంగా తిట్టుకుంటూ సిగలు పట్టుకొని కొట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి పాలనలో బస్సుల్లో సీట్లకు, యూరియా పంపిణీలో మహిళలు కొట్టుకునే మంచి మార్పు వచ్చిందని సొసైటీల వద్ద రైతులు చర్చించుకుంటున్నారు. నర్మెట మండల కేంద్రంలో యూరియా లారీ వెళ్తుండగా పీఏసీఎస్ వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు గమనించి అడ్డుకున్నారు. ఇక్కడే దించాలని పట్టుబట్టడంతో సొసైటీ సీఈవో వెంకటయ్య చేరుకొని సముదాయించారు. శనివారం యూరియా ఇస్తామనడంతో శాంతించారు. కాటారంలో యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదంటూ రైతులు గ్రో మోర్ సెంటర్ వద్ద రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. యూరి యా బస్తాలు ఇచ్చేదాకా వెళ్లేది లేదంటూ భీష్మించుకుని అక్కడే బైఠాయించారు. అనంతరం యూరియా బస్తాలు పంపిణీ చేయడంతో ఆందోళన విరమించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 5