హనుమకొండ సబర్బన్, జూలై 1 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలతో సాగునీటి లభ్యత భారీగా పెరిగింది. దీంతో రైతులు సంప్రదాయక పంటలను వదిలి మూకుమ్మడిగా వరి పంట వైపు మొగ్గు చూపారు. ఏకంగా వరి ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానానికి రాష్ట్రం ఎగబాకింది. అయితే భవిష్యత్‌లో వడ్లను అమ్ముకునే విషయంలో రైతులు ఎదుర్కొనే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ 2021-22లో వరి కంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంటలపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగా ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని సంకల్పించారు. దీని కోసం పలు బృందాలను ఇతర దేశాలకు పంపి అధ్యయనం చేసిన తర్వాత సాగు చేయించే ప్రయత్నాలు మొదలు పెట్టగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అయినా కేసీఆర్ మొక్కవోని దీక్షతో ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులకు అనేక సార్లు విఙ్ఙప్తులు చేశారు. దీంతో కొంత మేరకు స్పందించిన అన్నదాతలు ముందుకు వచ్చి సాగు ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు. అప్పుడు ముందుకు రాని రైతులు ఈ ఏడాది ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు పోటీ పడుతున్నారు. పెద్దాయన చెప్పినప్పుడే ఈ పంట వేసుకుంటే ఇప్పుడు తిప్పలు లేకుండా పైసలు వచ్చేవని అంతర్మథనం చెందుతున్నారు.

Warangal
సాగు కోసం భారీగా ధరఖాస్తులు
ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతులకు ఆదాయంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత మేరకు ఊతమిచ్చినట్లవుతుందనే దూరదృష్టితో కేసీఆర్ మొదలు పెట్టిన సాగు యజ్ఞం తొలి ఫలాలు లాభాల రూపంలో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. మొదటి సంవత్సరం సాగు చేసిన రైతుల భూముల్లో ఆరు నెలలుగా దిగుబడి ప్రారంభమైంది. గెలల ధర కూడా రికార్డు స్థాయిలో టన్నుకు రూ. 23,300 పలకడంతో రైతులకు కాసుల వర్షం కురుస్తున్నది. దీంతో పొరుగు రైతుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను గోసపెడుతున్న తీరు కూడా అన్నదాతల ఆలోచనల్లో మార్పునకు కారణమైంది.
ఫలితంగా ఉద్యాన శాఖ కార్యాలయాలకు రైతుల క్యూ మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటికే 2,95,045 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుండగా, ఈ సారి మరో 85 వేల ఎకరాల్లో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆయా జిల్లాలకు టార్గెట్లు విధించింది. ఈ లక్ష్యాలను ఎలా చేరుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్న తరుణంలో రైతుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలల కాలంలోనే దాదాపు టార్గెట్‌కు చేరుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం 24,118 మంది రైతులు 82,983 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేస్తామంటూ ఆయా జిల్లాల్లోని ఉద్యాన శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు.
జూన్ 17 వరకు అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం హనుమకొండ జిల్లాలో 1,450 ఎకరాల టార్గెట్ ఉండగా ఇప్పటికే 1,704 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ జిల్లాలో 1,100 టార్గెట్‌కు 2,365, జనగామలో 2,000కు 2,841, సూర్యాపేటలో 1,000కి 1,470, కరీంనగర్లో 1,000కి 1,561, నాగర్‌కర్నూల్‌లో 2,500కు 2,800, నిజామాబాద్‌లో 1,600కు 1,769, సంగారెడ్డిలో 3,000కు 3,327, నల్గొండలో 4,000కు 4,866, మంచిర్యాలలో 1000కి 2,314, జగిత్యాలలో 1,500కు 1,714, ఇక కామారెడ్డి జిల్లాలో 1,300 ఎకరాల టార్గెట్‌కు 2,090 ఎకరాలకు దరఖాస్తులు దాఖలయ్యాయి. మిగతా జిల్లాల్లో కూడా టార్గెట్‌కు దగ్గరగా వచ్చాయి.
ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు లక్షన్నర ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే సాగు కోసం వేలల్లో దరఖాస్తులు వస్తుండగా మంజూరు ప్రక్రియ మాత్రం నింపాదిగా సాగుతున్నది. అనుమతులిచ్చి డ్రిప్ మార్కింగ్ పూర్తి చేస్తే వానలు పడ్డప్పుడు మొక్కలు నాటుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ఇదే కాకుండా రైతులు డ్రిప్ పరికరాలను అమర్చే ఆయా కంపెనీలకు ప్రభుత్వం రూ. కోట్లల్లో బాకీ ఉన్నట్లు వాటి ప్రతినిధులు చెబుతున్నారు. పంట సాగు కోసం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ. 51 వేల వరకు నేరుగా ఖర్చు చేసింది. ప్రస్తుతం రైతుల నుంచి అనూహ్య స్పందన నేపథ్యంలో ఈ సబ్సిడీకి మంగళం పాడే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు.
గెలల నాణ్యత సూపర్ హిట్
ఆయిల్ పామ్ గెలల నాణ్యత, ఆయిల్ శాతం, మొక్కల పెరుగుదలపై ఉద్యాన పంటల నిపుణుల్లో కొన్ని అనుమనాలు వ్యక్తమయ్యాయి. వాటిని పటాపంచలు చేస్తూ అన్ని జిల్లాల్లోని రైతులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి కోతలోనే 6 టన్నుల దిగుబడిని రైతులు సాధించారు. ఏడాదిలో 15 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. ఏటా 3 నెలలు పంటకు గ్యాప్ ఉంటుందనుకున్నప్పటికీ ఏడాదంతా గెలలు వస్తూనే ఉన్నాయి. ఒక్కో చెట్టుకు 20 వరకు గెలలు వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గింజలో ఆయిల్ కంటెంట్ కూడా 20 శాతానికి మించి ఉంటుంది. సిద్దిపేట జిల్లా నంగునూరులో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ఆయా జిల్లాల నుంచి గెలల లోడుతో వెళ్తున్న వాహనాల బారులు రైతులకు కనువిందు చేస్తున్నాయి.
కేసీఆర్‌ను నమ్మి పంట వేసినం
నాకున్న నీటి సౌకర్యంతో పదెకరాల్లో వరి పంట వానకాలం, యాసంగిలో రెండు పంటలు ఎండకుండా పండేడివి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోనె నేను అందరూ వద్దని చెప్పినా ఆయిల్ఫామ్ నాటి మొక్కలను కంటికి రెప్పలాగా సాదిన. గత నాలుగు నెలల నుంచి దిగుబడి మొదలైంది. ధర కూడా బాగాను ఉండడంతో మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎనిమిది ఎకరాల్లో ఆయిల్ఫామ్ పంట ఉంది. ఇంకా నాలుగు ఎకరాల పొలం ఉంటే దాన్ని కూడా చెడ కొట్టిన మొక్కలకు డబ్బులు కట్టిన, దాన్ని ఆయిల్ఫామ్ సాగు మొదలు పెడుతున్న, ఇతర రైతులు కూడా వరిని వదిలి ఆయిల్ఫామ్ సాగు చేసుకుంటె మంచి భవిష్యత్ ఉంటుంది.
– చల్లా సమ్మిరెడ్డి, దామెర, హనుమకొండ జిల్లా