నర్సంపేట (ఖానాపురం), జూలై 20 : పాకాల ఆయకట్టుకు సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే గోదావరి జలాలను పాకాల చెరువులోకి విడుదల చేయాలన్నారు. రైతు సదస్సుకు హాజరైన నర్సంపేట ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖానాపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి హాజరు కాగా, సదస్సు ప్రారంభంలోనే పాకాల ఆయకట్టు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది.
పాకాల ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. పాకాల ఆయకట్టు కింద వెంటనే సాగు నీరు విడుదల చేయాలి.. ప్రభుత్వం, అధికారుల మొండి వైఖరి నశించాలి.. అంటూ నినాదా లు చేశారు. పాకాల తూములను వెంటనే తెరిచి నీరు విడుదల చేయాలని రెండు గంటల పాటు ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రైతు వేదిక నుంచి బయటకు వచ్చిన అన్నదాతలు పాకాల ఆయకట్టుకు వెంటనే సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖానాపురం-రంగాపురం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఖానాపురం, ధర్మారావుపేట సర్పంచ్‌లు దాసరి రమేశ్, మాడ్రోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు నాయకులు ధర్నా చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నీరు లేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళనతో స్పందించిన ఆర్డీవో సమస్యలపై వినతి పత్రాన్ని స్వీకరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పాకాల నీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాటోత్ సదర్లాల్, తక్కళ్లపల్లి బాబూరావు, అజహర్, బాలునాయక్, కోరె సుధాకర్, వల్లెపు శ్రీనివాస్, సమ్మయ్య, ఆబోతు అశోక్, గుగులోత్ బాలు, మచ్చిక అశోక్ రెడ్డి, బాలకిషన్, లింగమూర్తి, యాకయ్య, రాజశేఖర్, ఒర్సు రవి, కోరె రాము, చాగంటి వెంకటేశ్వర్లు, రాజు, వెంకన్న, భిక్షపతి, సంపత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.