ఏటూరునాగారం/ తాడ్వాయి/ మంగపేట/ గోవిందరావుపేట/ శాయంపేట, డిసెంబర్ 4 ; బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం రాశులను కాపాడుకునేందుకు పరదాలు కప్పి అప్రమత్తమవుతున్నారు. ఆరబోసిన ధాన్యం ఎండకపోవడంతో వర్షం పడితే ముక్కిపోయి మొలకలెత్తే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలు, ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పారు. తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా మబ్బులు కమ్ముకొని ఉండడంతో మిరప తోటలకు ఆకుముడత సోకే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు. ఓ ఇరవై రోజుల పాటు వాతావరణం అనుకూలిస్తేనే కొనుగోళ్లు సజావుగా సాగుతాయని అంటున్నారు. మరోవైపు పంట పొలాలు కోత దశలో ఉన్న రైతులు, ధాన్యం వర్షానికి రాలిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో పత్తి రైతుల్లోనూ టెన్షన్ నెలకొంది. ఏరుతున్న పత్తి తడిస్తుందేమోనని గుబులు చెందుతున్నారు.
ధాన్యం దండిగా.. మార్కెట్ నిండుగా..
కేసముద్రం, డిసెంబర్ 4 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ధాన్యంతో నిండిపోయింది. సోమవారం సుమారు 28వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు ఆశించిన మేర పడడం, కాళేశ్వర జలాలు చెరువులకు చేరడంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా రైతులు వరి సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వానకాలంలో సాగుచేసిన వరి పంట చేతికి రావడంతో రైతులు ధాన్యాన్ని విక్రయానికి తీసుకొస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్‌కు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సోమవారం మార్కెట్ తెరుచుకోవడంతో వివిధ ప్రాంతాల 28 వేల బస్తాల తీసుకురాగా షెడ్లు అన్నీ ధాన్యంతో నిండిపోయాయి. రైతులు ఆరుబయట కూడా ధాన్యాన్ని కుప్పలుగా ఆరబోశారు. మార్కెట్లో సన్నరకం క్వింటాల్ గరిష్ట ధర రూ.3,359, కనిష్ట ధర రూ.2,082 పలికింది. అయితే మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో వాతావరణం మార్పులు సంతరించుకున్న కారణంగా ఆరుబయట పోసిన ధాన్యానికి త్వరితగతిన కాంటాలు నిర్వహించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మార్కెట్ సామర్థ్యానికి మించి ధాన్యం విక్రయానికి రావడం, వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేశ్ ఒక్క ప్రకటనలో తెలిపారు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ రైతులు ధాన్యాన్ని విక్రయానికి తీసుకురావాలని సూచించారు.
జోరుగా వరికోతలు..
చిన్నగూడూరు, డిసెంబర్ 4 : వరి కోతలు జోరందుకున్నాయి. ఏ గ్రామంలో చూసినా హార్వెస్టర్‌తో కోత కోయిస్తూ, వడ్లను తూర్పార పడుతూ, మెదలను ట్రాక్టర్‌తో తొక్కించే పనులతో రైతులు, కూలీలు బిజీబిజీగా కనిపిస్తున్నారు.కొన్నిచోట్ల రైతులు స్వయంగా చేతులతో కోత పనులు చేస్తుండగా ఎక్కువ మంది యంత్రాలు వినియోగిస్తున్నారు.గిరాకీ ఎక్కువగా ఉంటుండడంతో ప్రతి గ్రామంలో హార్వెస్టర్ల సంఖ్య ఐదు నుంచి పదికి పెరిగింది. చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడం వల్ల రైతులు మిర్చి, పత్తి పంటలతో పాటు వరిసాగుపై రైతులు ఆసక్తిని చూపుతున్నారు. రెండు నెలల పాటు కూలీ పనులకు ఢోకా లేదని ఆయా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు చెబుతున్నారు. తెల్లవారుజాము నుంచే వ్యవసాయ పనులకు వెళ్తుండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట కోసం శ్రమిస్తున్నారు.