రేగొండ, మే 15 : కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందిపడుతున్నా, సర్కారుకు కనికరం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులుగాస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రేగొండ మండలం లింగాల మిల్లు వద్ద శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, మక్కజొన్న అమ్ముకోవడానికి మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి పగలనే తేడా లేకుండా రోజుల తరబడి రైతులు పడిగాపులుగాస్తున్నా ఎవరూ కొనడంలేదని, దిగుమతి చేసుకోవడం లేదన్నారు. లింగాలలోని మిల్లు వద్ద 8 రోజలుగా ట్రాక్టర్లలో ధాన్యం దిగుమతి కాకపోవడంతో రోజుకు రూ.2వేల చొప్పున రూ.16 వేలు రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ధాన్యం దిగుమతి చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన మిరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు అంకం రాజేందర్, నాయకులు పగడాల ఐలయ్య, బిక్యానాయక్, రమేశ్, రైతులు పాల్గొన్నారు.