తొర్రూరు, మే 25: రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతకు రవాణా కష్టాలు తోడయ్యాయి. అండగా నిలవాల్సిన అధికారులే కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రవాణా వాహన టారిఫ్‌లో సగం మాత్రమే చెల్లిస్తూ తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ హబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 31, ఐకేపీ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
డివిజన్‌కు 60 లారీలను కేటాయించినప్పటికీ, కనీసం 10 కూడా అందుబాటులోకి రాలేదు. లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం ఏర్పడడంతో రైతులే సొంత వాహనాలు సమకూర్చుకొని బస్తాలను మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ప్రైవేట్ వాహనాలతో ధా న్యం తరలించిన రైతులకు బస్తాకు కేవలం రూ.8 మా త్రమే చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తొర్రూరు డివిజన్‌కు సంబంధించిన లారీ ట్రాన్స్పోర్ట్ టెండర్ హనుమకొండకు చెందిన ‘యూనివర్సల్ రోడ్‌వేస్’ సంస్థకు దకిందని, టెండర్ స్లాబ్ ప్రకారం రైతులకు బస్తాకు రూ.15 నుంచి రూ.25 వరకు చెల్లించాల్సి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై కేవలం రూ. 8 మాత్రమే చెల్లిస్తున్నారని, దీంతో ఒకో రైతు సుమారు రూ. 10 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు తొర్రూరులో 4.50 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా, మరో 4 లక్షల బస్తాలు కొనాల్సి ఉన్నది. ప్రస్తుతం కాంటాలు వేసిన 1,06,547 బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయి. లారీలు లేక మిల్లులకు తరలింపులో ఆ లస్యం జరుగుతుండడంతో వెయిట్ లాస్ భారం కూ డా తమపైనే పడుతోందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల బస్తాలను రైతులే ప్రైవేట్ వాహనాల ద్వారా మిల్లులకు తరలించినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై రైతుల నుంచి సుమారు రూ. 25 లక్షల వరకు అక్రమంగా దోచుకున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదే క్రమంలో హరిపిరాల గ్రామానికి రవా ణా ఖర్చులు చెల్లించడానికి వచ్చిన లారీ కాంట్రాక్టర్ ను రైతులు అడ్డుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించారు. అయితే రైతులెవరూ కాంట్రాక్టర్ నుం చి డబ్బులు తీసుకోలేదు. తొర్రూరు డివిజన్‌లోనే ఈ స్థాయిలో దోపిడీ జరుగుతుంటే జిల్లావ్యాప్తంగా రూ. కోట్లు దండుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి లారీ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్లాబ్‌ల ప్రకారం అన్యాయం
తొర్రూరు డివిజన్లో ధాన్యం తరలింపునకు ప్రభుత్వం లక్ష్మీవాసవి (చిన్నవంగర), వరలక్ష్మి (తొర్రూరు), ఉమామహేశ్వర (వడ్డెకొత్తపల్లి), వెంకటలక్ష్మి (తొర్రూరు) మిల్లులను కేటాయించింది. లారీ రవాణాకు కిలోమీటర్ల ఆధారంగా స్లాబ్ విధానంలో చెల్లిస్తున్నప్పటికీ రైతులకు పూర్తిగా అందడం లేదు. తొర్రూరు మండలంలోని 17 కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో లారీ కాంట్రాక్టర్లు వాహనాలు పంపకపోవడంతో రైతులే సొంత ట్రాక్టర్ల ద్వారా బస్తాలను మిల్లులకు తరలిస్తున్నారు. 5 కిలోమీటర్ల వరకు (మొదటి స్లాబ్) ప్రకారం ప్రభుత్వం ఒకో బస్తాకు రూ.15, 10 కిలోమీటర్ల వరకు (రెండో స్లాబ్) ప్రకారం బస్తాకు రూ. 21, 15 కిలోమీటర్ల వరకు (మూడో స్లాబ్) ప్రకారం రూ. 23 చెల్లించాల్సి ఉన్నా, రైతులకు మాత్రం రూ. 8 మాత్రమే ఇస్తున్నారు.
రూ.6 లక్షలు కట్టిన..
మాకున్న ఐదెకరాల్లో ధాన్యం పండించి కొనుగోలు కేంద్రంలో పోశాక, సొంత ట్రాక్టర్ ఏర్పాటు చేసుకుంటేనే గన్నీ బ్యాగులు ఇస్తామని అధికారులు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనం కిరాయికి తీసుకొని వెళ్లి కాంటాలు వేయగా 308 బస్తాలు వచ్చాయి. వాటిని రెండు ట్రాక్టర్లలో మిల్లుకు తరలిస్తున్న సమయంలో కిష్టాపురం ఎక్స్‌రోడ్డు వద్ద ధాన్యం బస్తాలు ఒక వైపునకు కింద పడిపోయాయి. వెంటనే ట్రాక్టర్‌ను రోడ్డు పకన ఆపి హమాలీల కోసం వెళ్లి వచ్చేలోపే, ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నష్టపరిహారం పేరుతో నాతో రూ.6 లక్షలు కట్టించారు. మేము పండించిన మొత్తం పంట అమ్ముకున్నా కూడా అంత డబ్బులు రావు. రవాణా కాంట్రాక్టర్ సకాలంలో లారీలు పంపించి ఉంటే మాకు ఈ బాధలు వచ్చేవి కావు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.
– తుప్పతుర్తి వెంకన్న, రైతు, హరిపిరాల