హనుమకొండ సబర్బన్, జూలై 15 : ఆయిల్ పామ్ సాగు చేసేందుకు మొక్కలివ్వాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు ఏకంగా మరో ఏడాదిలో గెలలు కత్తిరించుకోవచ్చని చెట్లనే పం పారు. అందులోనూ ఎండిపోయిన వాటిని పంపిన అ ధికారుల నిర్వాకాన్ని చూసి అన్నదాతలు ముక్కున వే లేసుకుంటున్నారు. వరిని తగ్గించి ఆయిల్ పామ్ పం టను సాగు చేయాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం మొక్కల సరఫరాలో మాత్రం చేతులేత్తేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కల సరఫరా బా ధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. అప్పట్లో అంతా సవ్యంగా జరిగి రైతులకు నాణ్యమైన మొక్కలు అందాయి.
అప్పుడు నాటుకున్న రైతులకు దిగుబడులు కూడా మొదలై మంచి లాభాలు వస్తున్నాయి. ఈ తరుణంలో వేలాది మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవంతంగా మొక్కలు సరఫరా చేస్తున్న హనుమకొండ, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఏజెన్సీలను ప్రభుత్వం కొన్ని కారణాలు చూపించి రద్దు చేసి నిర్వహణ బాధ్యతలను ఆయిల్ ఫెడ్‌కు అప్పగించింది. దీంతో ఆ సంస్థ సూర్యాపేట జిల్లాకు భువనగిరి, కరీంనగర్, హనుమకొండ జిల్లాలకు సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ వద్ద ఏర్పాటు చేసిన నర్సరీల నుంచి మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నది. అయితే నర్సరీల నిర్వహణ సరిగా లేకపోవడంతో మొక్కలన్నీ నాసి రకంగా ఉన్నాయి.
కొందరికి ఎండిపోయిన మొక్కలు అంటగడుతున్న అధికారులు, మరికొందరికి రెండేళ్ల వయస్సున్నవి ఇస్తున్నారు. ఇలాంటికి మాకెందుకని రైతులు ప్రశ్నిస్తే.. మీ ఇష్టమైతే తీసుకోండి.. లేదంటే మొక్కలు వచ్చేంత వరకు వేచి చూడండని చెబుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు ఎండిన వాటినే నాటుకుంటుండగా మరికొందరు మాత్రం తిప్పి పంపుతున్నారు. ఎండిపోయి, పూర్తిగా పాలిపోయిన మొక్కలను నాటితే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. రెండేండ్ల మొక్క నాటితే దాని కాండం ఎప్పుడు పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. నర్సరీల నిర్వహణను గాలికి వదిలేశారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నర్సరీలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ విషయమై ఆయిల్ ఫెడ్ అధికారులను సంప్రదించగా, పూర్తిగా ఎండిపోయిన మొక్కను రిప్లేస్ చేస్తున్నామని చెబుతున్నారు.
నేను గతంలో నాలుగెకరాల్లో ఆయిల్ పామ్ వేసిన. అవి కటింగ్‌కు వచ్చినయ్. ఇతర పంటల కంటే బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో 5 ఎకరాల్లో నాటుకుందామని దరఖాస్తు చేసుకున్న. అయితే ఆరు నుంచి ఎనిమిది నెలల వయస్సున్న మొక్కలైతే ఆరోగ్యంగా పెరుగుతాయి. నాకు రెండేండ్లున్న మొక్కలు సరఫరా చేస్తే వద్దని తిప్పి పంపించిన. కొంచెం ఆలస్యమైనా మంచి మొక్కలు వచ్చిన తర్వాతే నాటుకుంటా.
– ఎడ్ల రవీందర్‌రెడ్డి, రైతు, దామెర, ఎల్కతుర్తి
నాకు మొత్తం ఎండి పోయిన మొక్కలు వచ్చినయ్.. నాటుకుంటే తిప్పలైతదని చెప్పిన.. ఎండిన కొమ్మల మధ్య నుంచి మొగి వస్తదని అధికారులు చెప్పిండ్రు. మళ్లీ మొక్కలు రావాలంటే చాలా టైం పడతదంటున్నరు. తీసిన గుంతలు కూడుకుపోతయని వాటినే నాటుకున్న. ఎట్లుంటదో మరి. నేను గతంలో ఏడెకరాల్లో పంట వేసుకున్న. ఇప్పుడు గెలలు కత్తిరిస్తున్న. అప్పుడు మంచి నిగనిగలాడే మొక్కలు వచ్చినయ్. ఇట్ల పెట్టుడుతోనే ఏనుకున్నయ్.
– చల్లా సమ్మిరెడ్డి, రైతు, దామెర, ఎల్కతుర్తి