గార్ల, మార్చి 19 : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పాకాల ఏరు ఎండిపోతున్నది. మార్చిలోనే నీళ్లు అడుగంటడంతో సాగు నీళ్లు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయి. గత జనవరిలో పాకాల ఏరులో సమృద్ధిగా నీళ్లుండడంతో సమారు 300 ఎకరాల్లో స్థానిక రైతులు వరి పంట సాగుచేశారు. మరో 40 రోజుల్లో చేతికి రానున్న పంట ప్రస్తుతం పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఇప్పటికే ఎకరానికి సుమారు రూ. 25 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తమ కండ్ల ముందే పంట ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
కాగా, పాకాల ఏరుకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా లేదా నర్సంపేట సమీపంలోని పాకాల చెరువునీటిని విడుదల చేయాలని కోరుతూ ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో రైతులు వినతి పత్రాలు అందజేస్తున్నారు. తాళ్లపూసపల్లి చెరువు నుంచైనా నీటిని విడుదల చేసి వరి పంటను కాపాడాలని రైతులు కోరుతున్నారు. వానకాలం పంటతో వచ్చిన ఆదాయం యాసంగిలో పోయి ఆకలి చావులు కనిపిస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఐబీ అధికారులు, కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
జలాలు విడుదల చేయాలి
పాకాల ఏరు పరీవాహక ప్రాంతంలో సాగుచేస్తున్న సుమారు 300 ఎకరాల వరి పంటకు నీళ్లు అందడం లేదు. పంట పొట్ట దశలోనే ఎండిపోతన్నది. జిల్లా అధికారులు స్పందించి పాకాల ఏటికి ఎస్సారెస్పీ లేదా పాకాల చెరువు నీరు విడుదల చేసి రైతులను కాపాడాలి. ప్రస్తుతం పాకాల ఏరులో నీళ్లు అడుగంటినయి. గతేడాది మాదిరిగా పాకాల చెరువు నీటిని వదిలి పెట్టాలి.
– శీలంశెట్టి రమేశ్, రైతు, గార్ల