ఖానాపురం, జూలై 18: వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని సిల్లీ మాటలు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓ థర్డ్‌క్లాస్ ఫెలో అని, అతడికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కరంటు విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు మేరకు మంగళవారం అశోక్‌నగర్ రైతు వేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదాతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పెద్ది మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరంటు కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రకటించాడని విమర్శించారు.
3 హెచ్‌పీ మోటరుతో గంటకు ఎకరం చొప్పున 3 గంటల్లో మూడు ఎకరాల భూమిని పారించండం సాధ్యమన్న రేవంత్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా.. అని రైతులను ప్రశ్నించగా అందరూ ఖండించారు. చంద్రబాబు మెదడుతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏలుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. ఇలాంటి నాయకుడు సీఎం కేసీఆర్‌కు పోటీనా అని ప్రశ్నించారు. 3 గంటల కరంటును సీఎం కేసీఆర్ 24 గంటలకు తీసుకెళ్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ 3 గంటలకు తీసుకొస్తానంటున్నదని, ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ పాలనొస్తే రాష్ట్రంలో మళ్లీ పవర్ హాలీడేలు, క్రాఫ్ హాలీడేలే ఉంటాయని హెచ్చరించారు.
రైతుల కష్టాలు తెలిసిన నేత కేసీఆర్
రైతుల బాధలు, కష్టాలు సీఎం కేసీఆర్‌కు తెలిసినన్నీ మరెవరికీ తెలియవని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేరా అన్నారు. త్వరలోనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీపై సీఎం కేసీఆర్ శుభవార్త అందించనున్నారని తెలిపారు. 24 గంటల ఉచిత కరంటు వద్దంటున్న కాంగ్రెస్ నాయకులను ఊరిపొలిమేర దాకా తరిమికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను ఎలాగైనా దోచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకుల కుట్రలను రాబోయే నాలుగు నెలలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతుబంధు కన్వీనర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.