ఏడాదిన్నర కిందటి వరకు గోదావరి జలాలతో కళకళలాడిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జలాశయాలు నేడు చుక్క నీరు లేక ఎండిపోయాయి. మండు వేసవిలోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు ఎండాకాలం ప్రారంభంలోనే నీళ్లు లేక నెర్రెలు బారగా.. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఫలితంగా బోర్లు, బావులు నిరుపయోగంగా మారాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అస్తవ్యస్తంగా మారింది. ఎస్సారెస్పీ, దేవాదుల కాల్వల ద్వారా చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపని కాంగ్రెస్ ప్రభుత్వ పాపం.. రైతులకు శాపంగా మారింది. నీళ్లుండీ ఇవ్వలేని సర్కారు అసమర్థ పాలన పదేళ్ల కిందటి సాగు కష్టాలను తెచ్చిపెట్టింది.
ఉమ్మడి జిల్లాలోని వాగుల్లోకి సైతం గోదావరి జలాలు రాక వట్టిపోవడంతో యాసంగిలో లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు సాగునీరందక ఎండిపోతున్నాయి. పలుచోట్ల పొట్ట దశకు వచ్చిన వరి, కంకి పెడుతున్న మక్కజొన్న కళ్లముందే మాడిపోతుంటే కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వాగుల పరీవాహక ప్రాంత రైతులు మూకుమ్మడిగా గుంతలు తీసి మోటర్ల ద్వారా నీరు పారించేందుకు యత్నిస్తున్నారు. అడుగంటిన బావుల్లో పూడికతీస్తున్నారు. దీనికి తోడు కరెంట్ కోతలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. వచ్చి పోయే విద్యుత్‌తో మోటర్లు కాలిపోతుంటే వాటికి మరమ్మతులు చేసి తిరిగి బిగిస్తున్నారు.
అయినప్పటికీ ఒక్క మడి పారకపోవడంతో చేసేదేమీ లేక పలువురు రైతులు పంటను పశువులకు మేతగా వదిలేస్తుండగా.. ఆశ చావని మరికొందరు వేసవికాలమైనా వానదేవుడు కరుణిస్తాడేమోనని మొగులు వైపు చూస్తున్నారు. అష్టకష్టాలు పడినప్పటికీ చివరికి వేలాది రూపాయలు ఖర్చుచేసి సాగుచేసిన పంట చేతికొస్తుందో.. లేదోనని దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. సాగునీరు లేక పంటలు ఎండుతున్న పరిస్థితిపై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించి రైతులను పలుకరించింది. పంటను కాపాడుకునేందుకు వారు పడుతున్న కష్టాలను కళ్లారా చూసింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువని మండిపడ్డారు. తమ నీటి సమస్యను పట్టించుకోని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణయుగంలా సాగిన కేసీఆర్ పదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
– నమస్తే నెట్వర్క్, మార్చి 11
గుంతలు తీసి.. పంటకు నీళ్లు
నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి, ఎర్రబెల్లిగూడెం, కాచికల్, బ్రాహ్మణకొత్తపల్లి, మునిగలవీడు, మదనతుర్తి గ్రామాల రైతులు ఆకేరువాగు నీటిని సాగుకోసం వినియోగించుకుంటారు. అయితే గత పదేళ్లలో ఏనాడూ ఎండిపోని ఆకేరువాగు ఈ ఏడాది మార్చి ప్రారంభానికే అడుగంటింది. వాగు మొత్తం ఎండిపోవడంతో దీని పరీవాహక ప్రాంతంలో సాగు చేసిన పంటలకు సాగు నీరు లేక రైతులు అరిగోస పడుతున్నారు. పంటలను కాపాడాకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రాహ్మకొత్తపల్లి రైతులు జేసీబీ సాయంతో ఆకేరు వాగులో పెద్ద గుంత తవ్వించి దానిలో సుమారు 50 మోటర్లు ఏర్పాటు చేసుకొని పంటలకు సాగునీరందించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సాగునీటి సౌకర్యం కల్పించి ఎండుతున్న పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
కళ్లముందే నెర్రెలు బారుతున్నది..
కాటారం : మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామం. గ్రామంలోని చింతల చెరువు కింద నాకున్న ఎకరంతోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేసిన. 20 రోజులుగా పంటకు నీరందక ఎండిపోతుంది. నిరుడేమో చెరువు నిండా నీళ్లుంటే ఏర్పడలేదు. ఇప్పుడు నీళ్లు లేక మళ్లీ మాకు కష్టాలు రావట్టే. కళ్లముందే పొలమంతా బీటలు పారుతుంటే ముద్ద నోట్లోకి పోతలేదు. ఈ పంట చేతికి రాకపోతే చేసిన అప్పులు ఎట్ల తీరుతాయోనని ఇప్పటిసందే దిగులు మొదలైంది.
– డొంగిరి ఎల్లయ్య, రైతు, గారెపల్లి, కాటారం మండలం
యాసంగిల వంద మోటర్లు అల్లిన
దేవరుప్పుల : నీళ్లు లేక మోటర్లు కాలుతున్నయ్. ఇన్నేండ్లు గిరాకీ లేకుండె. ఈ యాసంగిల వంద మోటర్లు కాలితే అల్లిన. కరెంటు తేడా వస్తుంది. మోటర్లు వేడెక్కి కాలుతున్నయ్. నేను కాంగ్రెస్ పార్టే కానీ, ఏ మాటకామాటే.. కేసీఆర్ పాలనే బాగుండె. ఇక్కడ దయాకర్‌రావు పనులు చేసేది. మార్పు కోరితే మంచి జరుగుతదనుకుంటే అంతా ఆగమాగమే అయితాంది. నాకు గిరాకీ వస్తుంది గాని రైతులు నీళ్లు లేక మోటర్లు కాలి మొత్తుకుంటుండ్రు.
– గుగులోతు రాజు, మోటర్ మెకానిక్, దోనెబండ తండా, దేవరుప్పుల మండలం