తొర్రూరు/నర్సింహులపేట/ఖానాపురం/దంతాలపల్లి, ఫిబ్రవరి 19 : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సరిపడా దొరకకపోవడంతో పనులు మానుకొని ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతూ గంటలకొద్దీ బారులు తీరారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, దంతాలపల్లి, వరంగల్ జిల్లా ఖానాపురం మండలకేంద్రాల్లోని అగ్రోస్, పీఏసీఎస్ గోదాముల వద్ద యూరియా బస్తాల కోసం పోటీపడ్డారు. లైన్లో ఉన్నవారికి కాకుండా పైరవీకారులకు పెద్ద ఎత్తున యూరియా అమ్ముతున్నారని, ఉదయం వంద బస్తాలు ఉంటే 30మందిమి లైన్లో ఉన్నామని బస్తాలు అయిపోయాయి కానీ తాము మాత్రం ఇక్కడే ఉన్నామంటూ సిబ్బందితో గొడవకు దిగారు.
నర్సింహులపేటలో యూరియా కోసం క్యూలైన్లో తోపులాట జరగడంతో గొడవ జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో యూరియా సక్రమంగా అందుబాటులో ఉండడం లేదని, నర్సింహులపేట, దంతాలపల్లి మండల కలిపి 220 బస్తాల యూరియా వస్తే పంటలకు యూరియా ఎలా సరిపోతుందని వ్యవసాయ అధికారులను అడిగితే దాటేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. దంతాలపల్లిలో ఒక యూరియా బస్తా కోసం వచ్చిన లారీల నుంచి యూరియా బస్తాలు కిందికి దిగుమతి కాకమందే రైతులు తీసుకొచ్చుకున్న ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై బస్తాలను వేసుకునే ప్రయత్నం చేశారు. ఖానాపురం పీఏసీఎస్‌కు బుధవారం ఉదయం లారీ లోడ్ యూరియా రావడంతో రైతులు ఎగబడ్డారు. ఉదయం నుంచి క్యూలో ఉన్నా దొరకక కొందరు రైతులు వెనుదిరిగారు. మధ్యాహ్నం మరో లోడ్ రావడంతో మరికొంత మంది తీసుకెళ్లారు. సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని పాకాల ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా తొర్రూరులో పోలీసు పహారాల యూరియా పంపిణీ చేయాల్సి వచ్చింది.
వరి నాటు వేసి నెలరోజులైనా ఒకసారి కూడా యూరియా వేయలేకపోయామని, వారంలో నాలుగు రోజులు వచ్చినా బస్తా కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే పంట ఎలా పండిస్తామని సిబ్బందిని నిలదీస్తున్నారు. రెండు వారాలుగా పడరాని పాట్లు పడుతున్న అన్నదాతలు.. మళ్లీ సమైక్యపాలన నాటి రోజులు వచ్చాయని గుర్తుచేసుకుంటున్నారు. యూరియా కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరకు అమ్మడంతోపాటు పురుగుమందులను లింక్ పెడుతున్నారని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సంబంధిత వ్యవసాయ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు బస్తాల కోసం నలుగుసార్లు వచ్చిన
యాసంగి రెండు ఎకరాల వరిసాగు చేసిన నాటు వేసి నెల రోజులు గడిచినా ఇప్పటివరకు పొలానికి యూరియా వేయలేదు. రెండు బస్తాల కోసం వారంలో నాలుగు సార్లు వచ్చిన బస్తా కూడా దొరకలేదు. బయట కొందామంటే పైమందు కొంటెనే యూరియా బస్తా ఇస్తామంటున్నరు. ఇప్పటికే పొలానికి పైమందు కొట్టాను. మల్ల పైమందు తీసుకొని ఏం చేసుకోవాలి. ఇప్పటికే నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు యూరియా దొరకక పోతే ఉన్న పంట ఎలా పండుతుందో. – మారపంగు భద్రయ్య, నర్సింహులపేట