హనుమకొండ, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ప్రభుత్వ స్థలాలు.. ప్రైవేట్ వ్యక్తుల ప్లాట్లు.. రైతుల వ్యవసాయ భూములు.. చెరువు, కుం టల శిఖం.. అసైన్డ్ ల్యాండ్స్ కావేవి కబ్జాకు అనర్హం’ అన్నట్లుగా ఉంది అక్రమార్కుల వ్యవహారం. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. అక్రమంగా వెంచర్లు చేసి అడ్డగోలు గా దోచుకుంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బందితో కుమ్మక్కై తమ కబ్జా పర్వా న్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. భూముల ధరలు పెరగడం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో అన్ని రకాల భూములను చెరబడుతున్నారు. అనుమతులు లేకుండానే వెంచర్లు చేసి.. అందులో నిర్మాణాలు చేపట్టి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. వరంగల్ నగరానికి దగ్గరగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలోనే ఫొటోలు పోస్ట్ చేసి రూ. కోట్ల విలువైన భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఇప్పుడీ దందా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో హాట్ టాపిక్‌గా మారగా.. మరికొన్ని రోజుల్లో చెరువులు, కుంటల ఆనవాళ్లు కూడా లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల అలసత్వంతో శిఖం, అసైన్డ్ భూముల కబ్జాకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది.
ఐనవోలు మండలం పున్నేల్లోని బాబాయికుంట (తురకవారి కుంట) పరిధిలోని 74, 75, 76, 77, 78, 79, 80 సర్వే నంబర్లలో సుమారు 10 ఎకరాల శి ఖం భూమి ఉన్నట్లు రెవె న్యూ రికార్డులు చెబుతున్నాయి. జలాశయాలకు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) నుంచి కొద్ది మేర బఫర్ జోన్ ఉంటుంది. చిన్న చెరువు లు, కుంటలకు 9 మీటర్ల వరకు దీని పరిధి ఉం టుంది. అయితే ప్రభుత్వ నిబంధనలతో సంబం ధం లేకుండా బాబాయికుంటలో అడ్డంగా గోడ నిర్మించి కబ్జా చేశారు. కుంట తూము, మత్తడిని కూడా అక్రమార్కులు వదిలిపెట్టలేదు.
కుంట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోనే వెంచర్ చేసి క్రయవిక్రయాలు ప్రారంభించారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో లోపాయికారి ఒప్పందం తర్వాతే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వెంచ ర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ భూములను వ్యవసాయ కేటగిరీలో గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరోవైపు ఐనవోలు మండల కేంద్రంలోని రెవెన్యూ ఆఫీసు సమీపంలోనే వరద కాల్వను కబ్జాచేసి వెంచర్ ఏర్పాటు చేసినా అధికారు లు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వెలసిన ఓ వెంచర్‌లోనూ వరద కాల్వ ను కజ్జా చేసి విక్రయాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేని ఈ వెంచర్లలో భూములు కొన్న వారికి ఇండ్ల నిర్మాణాల కోసం అనుమతులు వచ్చే అవకాశం లేదు.
ఐనవోలు మండలం పంథినిలో 126, 127 సర్వే నంబర్లలోని అసైన్డ్ భూములను బీజేపీకి చెందిన ఓ నాయకుడు కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల సహకారంతో వెంచర్ కోసం హద్దురాళ్లను ఏ ర్పాటు చేశాడు. ఈ అంశంపై గత నెలలో ‘నమ స్తే తెలంగాణ’ ఎయిర్పోర్ట్ ఎరగా రియల్ దం దా! శీర్షికతో కథనం ప్రచురితమైంది. అనంత రం అధికారులు అక్రమ వెంచర్లో హద్దురాళ్ల ను తొలగించారు. తర్వాత కొన్ని రోజులకు రెవె న్యూ శాఖ అధికారుల సహకారంతో మళ్లీ ఈ వెంచర్‌లోని భూముల అమ్మకం కొనసాగుతున్నది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, ఆ దాయం తగ్గేలా రెవెన్యూశాఖ అధికారులు వ్య వహరిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.