నల్లబెల్లి : మానవాళి మనుగడకు నీరే(Water) ప్రధానం. నీటి ఆవాసాల మధ్యే మానవ నాగరికథ వెల్లివిరిసిందనేది కాదనలేని సత్యం. అంతటి ప్రాముఖ్యమున్న నీటిని తెలివిడితో పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి విలువ తెలిసిన ఓ రైతు పంటల గొంతు తడిపేందుకు ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టిన తీరు స్ఫూర్తినిస్తున్నది. ఎండలు మండిపోతున్నాయి. సాగు, తాగు నీటికి ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని మంచినీళ్ల కోసం మైళ్లదూరం ప్రయాణిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలతో రైతన్నలు పంటలకు నీరు అందించలేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు.
ఈ క్రమంలో నల్లబెల్లి మండలంలోని బోలోనిపల్లె గ్రామ సమీపంలో ఓ రైతు బొట్టు బొట్టు ఒడిసి పట్టు అన్న చందంగా తన బోరు బావికి ఏర్పాటు చేసిన మోటర్ పైపు నుంచి నీరు కారి వృథాగా పోతుండడంతో ఆ నీటిని ఓడిసి పట్టేందుకు రైతు ఓ ప్లాస్టిక్ కవర్ను పైపులకు అనుసంధానంగా చుట్టి నీరును తన పొలంలోకి వదలాడు. నీటి విలువ కేవలం అన్నదాతకే తెలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా నీటిని వృథా కాకుండా నీటి బొట్టును ఒడిసి పడుతున్న రైతు ఉపాయాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.