గంగారం, జూలై 18 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండల పరిధిలోని దుబ్బగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోటపోతుల సతీశ్(40) తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి మక్కజొన్న పంట సరిగా పండక దిగుబడి రాక రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాదిలోనైనా పంటలు బాగా పండుతాయనుకుంటే ఇప్పటికీ వర్షాలు సరిగా పడలేదు.
వ్యవసాయం కలిసిరాక ఆటో ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని నడుపుతున్నాడు. అయితే ఆటో కిస్తీ కట్టలేక, వర్షాలు పడక అప్పులు ఎలా కట్టాలని మానసిక ఒత్తిడికి గురై గురువారం సాయంత్రం తన చేను వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.