లింగాలఘనపురం, జూలై 12 : గుండెల నిండా తొలి ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నారని, ఆ అభిమానాన్ని ఎవరూ చెరపలేరని అంటున్నారు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలకేంద్రానికి చెందిన రైతు బెజ్జం చంద్రయ్య. గతంలో ఆయన తనకున్న 6 ఎకరాల భూమిని కౌలుకిచ్చి, తాను ఆటో నడుపుకునేవాడు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు పథకంతో పంట పెట్టుబడి సాయం, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మతు చేయించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా పోయింది.
దీంతో తన భూమిని తానే సొంతంగా సాగు చేసుకుంటున్నాడు. కూతురికి వివాహం చేయగా కల్యాణలక్ష్మి, మనుమరాలు జన్మించగా కేసీఆర్ కిట్టు తదితర పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. వ్యవసాయ పనులు చేసే క్రమంలో కేసీఆర్ పాటలతో కూలి వాళ్లతో ఉత్సాహంగా పని చేయించేవాడు. ఇలా కేసీఆర్పై ఎనలేని అభిమానంతో ఉన్న చంద్రయ్య తన నారు మడిని ‘కేసీఆర్ సీఎం’ పేరుతో అలికించి కృతజ్ఞత చాటుకున్నాడు.