పంట పండించడమే పాపమైందనట్లుగా రైతులు భరింపరాని శోకం అనుభవిస్తున్నారు. చేతికొచ్చి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రోజులు, వారాలు, నెలలు దాటిపోయింది.. అయినా కొనే దిక్కులేక అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వడ్ల రాశులను చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు ఈ తండ్లాట.. ఇంకెన్ని రోజులు ఈ బాధలని లోలోన కుమిలిపోతున్నారు. సర్కారు తీరుపై కడుపు మండి కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ వద్ద కొందరు రైతులు శుక్రవారం వడ్ల బస్తాలను తగలబెట్టి నిరసన తెలపగా, మరో రైతు పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రఘునాథపల్లి మండలం మండలగూడెంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
కొడకండ్ల, మే 29 : ధాన్యం కొనుగోళ్లు, బస్తాలను మిల్లులకు తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట శుక్రవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద వడ్ల బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ రైతు పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అధికారులు, రైతులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
కొడ్లకండ్లలోని వ్యవసాయ మారెట్ కమిటీలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కాంటాలు పెట్టడడంలో వడ్ల బస్తాలను మిల్లులకు తరలించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మార్కెట్ ప్రధాన గేటు ఎదుట రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. అందరూ చూస్తుండగానే వడ్ల బస్తాలపై గడ్డిని వేసి తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐకేపీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో అధికారుల వేధింపులు భరించలేక గుగులోత్ లషర్ అనే రైతు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
లషర్కు సంబంధించిన ధాన్యం కాంటాలు పూర్తయినా, అధికారులు కొద్ది రోజులుగా సుమారు 500 బస్తాల లోడ్‌ను లారీలోకి ఎకించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఆకాశం మబ్బులు పట్టి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి ఉండడంతో లష్కర్ ఆందోళనతో తన బైక్‌లోని పెట్రోల్ బాటిల్ తీశాడు. ధాన్యాన్ని లోడ్ చేయకుంటే పెట్రోల్ పోసుకోవడంతోపాటు వడ్లను తగులబెట్టుకుంటానని హెచ్చరించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అధికారులు, రైతులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ అనిల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని శాంతింపజేశారు. అనంతరం లారీలను తెప్పించి ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టారు.
రఘునాథపల్లి : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో స ర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రఘునాథపల్లి మండ లం మండలగూడెంలో శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో మండెలగూడెంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెలవుతున్నా 30 శాతం ధాన్యానికి మాత్రమే కాంటాలు వేసి మిల్లులకు తరలించారని రైతులు ఆరోపించారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు చింతల బాలకృష్ణ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నా కాంటాలు సక్రమంగా జరగడం లేదన్నారు. రోహిణి కార్తె రావడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమ యం ఆసన్నమైందన్నారు.
కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తున్నదన్నారు. తాలు, తూకం పేరుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లు యాజమాన్యాలు క్వింటాలు నాలుగు కిలోల వరకు తరుగు తీస్తూ నష్టం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు నానా కష్టాలు పడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ఆధికారులు స్పందించి రెండు రోజుల్లో ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు తోట నరేశ్, గాదె ఉపేందర్, జయరాం, డ్యాగల ఎల్లయ్య, బోళ్ల అఖిల్, చింతకాయల నరేశ్, పరశురాములు, కనకరాజు, పల్లపు మల్లయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు పాల్గొన్నారు.