సుబేదారి, జూన్ 6 : నకిలీ పురుగు మందులు, విత్తన విక్రయాలకు పాల్పడిన రెండు ముఠాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, పరకాల, గీసుగొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని కమిషనరేట్‌లో సీపీ సన్‌ప్రీత్‌సింగ్ నిందితుల అరెస్ట్ చూపించి, వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన మాబోయిన తిరుపతి, ములుగు ఘన్పూర్ మండలం పాపయ్యపల్లికి చెందిన అన్నం కుమారస్వామి, మేడ్చెల్‌కు చెందిన జయదీప్ గౌతమ్, మోహిదీపట్నానికి చెందిన ముద్దంగుల ఆదిత్య ముఠాగా ఏర్పడి హైదరాబాద్ మోహిదీపట్నంలో నకిలీ పురుగు మందులు తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు.
పక్కా సమాచారంతో ప్రధాన నిందితుడు తిరుపతి ఇంట్లో పోలీసులు దాడులు చేయగా, రూ.57.44లక్షల విలువ చేసే నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులు దొరకగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు జయదీప్గౌతమ్, ఆదిత్య, కుమారస్వామిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. అలాగే వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన బెరిరెడ్డి మర్రిరెడ్డి, సంగారెడ్డి, చింతల చెరువు గ్రామానికి చెందిన తుమ్మగుండ్ల సందీప్‌రెడ్డి, తుమ్మగుండ్ల విజయజోసెఫ్ ముఠాగా ఏర్పడి రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు మర్రిరెడ్డి ఇంట్లో దాడులు చేసి రూ.6.18లక్షల విలువ చేసే 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, పరకాల, మామునూరు ఏసీపీలు సతీశ్‌బాబు, వెంకటేశ్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బాబూలాల్, సార్లరాజు, రంజిత్, పరకాల, గీసుగొండ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందిని సీపీ అభినందించారు.