ములుగు, అక్టోబర్21(నమస్తే తెలంగాణ) : నకిలీ పట్టాలపై ములుగు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘అటవీ భూములకు నకిలీ పట్టాలు’ కథనానికి స్పందిం చారు. దీంతో ములుగు ఎఫ్ఆర్వో జిల్లా కేంద్రంలోని అన్ని బ్యాంకులను తనిఖీ చేసి ఇటీవల నకిలీ పట్టాల తో రుణాలు పొందిన వారి పాసు పుస్తకాలను, వివరాలను సేకరించగా, విస్తుపోయే మరిన్ని నిజాలు వె లుగులోకి వచ్చాయి. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంతకాలతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేసే క్రమంలో ములుగు ఎఫ్ఆర్వో సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు తేలిం ది. మరో రెండు రోజుల్లో దందాకు తెరలేపిన వ్యక్తులు, అందుకు సహకరించిన వారి వివరాలను అటవీ శాఖ అధికారులు వెల్లడించే అవకాశాలున్నాయి.
ములుగు మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో 100 నుంచి 150 మంది గిరిజనేతరుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 40వేల చొప్పున వసూలు చేసి నాలుగు ఎకరాలకు పైబడి భూమిని నమోదు చేస్తూ నకిలీ అటవీ హక్కు పట్టాలను అందిస్తున్నారు. భూమి ఎక్కడ ఉందనేది తెలియకున్నా పాసు పుస్తకాలు అందిస్తున్నా రు. గతంలో ములుగు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా పనిచేసిన అంకిత్, డీఎఫ్‌వోగా పనిచేసిన కృష్ణగౌడ్ సంతకాలను పొందుపర్చి పుస్తకాలను జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వ ఎంబ్లమ్‌ను కూడా నకిలీది తయారు చేసి గుర్తు ప ట్టలేకుండా అతికిస్తున్నారు.
ములుగు కలెక్టరేట్లో పనిచేసే ఓ ఉద్యోగితో పాటు ఓ రిటైర్డ్ ఫారెస్టు అధికారి, ప్రైవేట్ నెట్ సెంటర్ వ్యక్తితో పాటు మరికొంత మంది ముఠాగా ఏర్పడి గిరిజనేతరుల వద్ద అందిన కాడికి దో చుకుంటున్నారు. పట్టా వచ్చిన అనంతరం బ్యాంకుల ద్వారా క్రాప్‌లోన్ తీసుకుంటే తిరిగి రూ.5వేల చొప్పు న వసూలు చేస్తున్నారు. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామ కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్న ది. గ్రామంలో చికెన్ సెంటర్ నడిపే ఓ వ్యక్తి గిరిజనేతరుల నుంచి డబ్బులు తీసు కొని మరొకరికి అందిస్తున్నాడు.
నకిలీ పట్టాలు పొందిన వారు జిల్లా కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌ను మధ్యవర్తుల ద్వారా సంప్రదించి నాలుగు ఎకరాలకు రూ. లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు రుణాలను పొందుతున్నారు. ఇతర బ్యాంకు అధికారులు నిరాకరించినా, ఏజీవీబీ మేనేజర్‌తో పాటు ఫీల్డ్ ఆఫీసర్ ముడుపులు తీసుకొని రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తున్నది. కాగా, విషయం బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు సోమవారం కాసిందేవిపేట, రామయ్యపల్లి గ్రామాల్లో పర్యటించి రుణాలను పొందిన గిరిజనేతరుల వద్దకు వెళ్లి రుణాలు కట్టాలని ప్రాధేయ పడినట్లు తెలిసింది.