పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగగా మంగళవారం ఓట్లను లెక్కించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుండగా వరంగల్ సెగ్మెంట్‌కు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో, మానుకోటలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్‌లో 127 రౌండ్లు, 124 టేబుళ్లు.. మానుకోటలో మొత్తం 132 రౌండ్లు, 98 టేబుళ్ల ద్వారా లెక్కింపు జరుపనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లను లెక్కించనున్నారు.
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ మే 13న జరగ్గా, మొత్తం 18,24,466 మంది ఓటర్లలో 12,56,310 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 68.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు ఆర్వో, కలెక్టర్ పీ ప్రావీణ్య తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు 124 టేబుళ్లపై 127 రౌండ్ల ద్వారా నిర్వహించనున్నారు. మొత్తం 42 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లను 18సీ గోదాములో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 టేబుళ్లపై లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 17రౌండ్లు మాత్రమే ఉండటం వల్ల కౌంటింగ్ మొదట పూర్తి కానుంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 17 టేబుళ్ల ద్వారా 18, పాలకుర్తిలో 17 టేబుళ్ల ద్వారా 18, పరకాలలో 14 టేబుళ్ల ద్వారా 18, వరంగల్ పశ్చిమలో 14 టేబుళ్ల ద్వారా 18, వరంగల్ తూర్పులో 14 టేబుళ్ల ద్వారా 17, వర్ధన్నపేటలో 16 టేబుళ్ల ద్వారా 18, భూపాలపల్లిలో 18 టేబుళ్ల ద్వారా 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం నియమించిన ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్‌చంద్, రాజేశ్‌కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని వెల్లడించారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు.
మహబూబాబాద్ లోక్‌సభకు సంబంధించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,32,366 మంది ఓటర్లుండగా 11,01,030ఓట్లు(71.85%) పోలయ్యాయి. భద్రాచలం, పినపాక, ఇల్లెందు, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒకో రౌండ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 132 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో 19 రౌండ్లు, మహబూబాబాద్-21, నర్సంపేట- 21, ములుగు- 22, పినపాక -18, ఇల్లెందు -18, భద్రాచలం-13 రౌండ్లలో లెక్కించనున్నారు. అత్యధికంగా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం 22 రౌండ్లు కాగా, భద్రాచలం అత్యల్పంగా 13 రౌండ్లు ఉన్నాయి. కౌంటింగ్ కోసం ఒకో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున మొత్తం 98 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒకో రౌండ్లో 98 ఈవీఎంలలో ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు, మీడియా ఇలా ఎవరైనా సరే పాస్ ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పటికే బందోబస్తు ఉన్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పాస్‌లు ఉన్న వారిని లోనికి అనుమతించనున్నారు.